Hot Posts

6/recent/ticker-posts

కిడ్నీ సమస్యతో మరణించిన వ్యక్తి కుటుంబానికి "కిట్స్" సంస్థ ఆర్థిక సాయం


ఏలూరు జిల్లా, చాట్రాయి: చనుబండ పంచాయతీ శివారు కరుణాపురం గ్రామానికి చెందిన పిల్లి ప్రకాశరావు (42) అనే భవన కార్మికుడు రెండు నెలల క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయనకు ఎటువంటి ఆస్తులు గానీ, స్థిరమైన ఆదాయం గానీ లేకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.


ప్రకాశరావుకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, వారి చదువు మరియు కుటుంబ పోషణ భారమంతా తల్లి మీద పడింది. ఈ దయనీయ పరిస్థితిని గమనించిన భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి, ఇటీవల తిరువూరు పట్టణంలో పేద పిల్లల విద్య కోసం సేవలు అందిస్తున్న “కిట్స్” సంస్థ దృష్టికి విషయం తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా కిట్స్ సంస్థ కార్యదర్శి శ్రీమతి జంగం కస్తూరిని కలిసి కుటుంబ పరిస్థితిని వివరించగా, వారు వెంటనే స్పందించారు. కిట్స్ సంస్థ ద్వారా హైదరాబాద్‌కు చెందిన బూరుగు విజయభాస్కర్ (SE / Vigilance / TG TRANSCO) రూ.50,000ల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు.

ఈ సహాయానికి తోడ్పాటు అందించిన బీజేపీ నాయకులు శ్రీకర్ బుర్రి కి, ఆర్థిక సహాయం చేసిన బూరుగు విజయభాస్కర్ కి, అలాగే కిట్స్ సంస్థ కార్యదర్శి శ్రీమతి జంగం కస్తూరి కి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదల పిల్లల విద్య కోసం కిట్స్ సంస్థ చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.