ఏలూరు జిల్లా: వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మత్తు ఇచ్చి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర కిలాడీ దొంగను ముసునూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ముసునూరు ఎస్‌ఐ ఎం. చిరంజీవి నేతృత్వంలో ప్రత్యేక బృందం చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకుంది. అరెస్ట్ అయిన వ్యక్తి పబ్బరాజు వెంకట యుగందర్ (38), తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. ఇతనికి గత 20 సంవత్సరాలుగా నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు.
నిందితుడు ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల వద్దకు వెళ్లి “ఇల్లు అద్దెకు కావాలి” అని నమ్మించి, పానకంలో మత్తు మాత్రలు కలిపి తాగించి వారు స్పృహ కోల్పోయిన తర్వాత బంగారు ఆభరణాలు, నగదు దోచుకుని పరారయ్యేవాడని పోలీసులు తెలిపారు.
వలసపల్లి (ముసునూరు), ప్రగడవరం(చింతలపూడి), వేగవరం(దెందులూరు), పురిటిగడ్డ(చల్లపల్లి) గ్రామాల్లో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి 149 గ్రాముల బంగారు నానుతాళ్లు, నాలుగు స్మార్ట్ ఫోన్లు, ఒక హోండా షైన్ మోటార్ సైకిల్‌తో పాటు నేరానికి ఉపయోగించిన మత్తు మాత్రలు, పానకం తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్, సీఐ రామకృష్ణ మాట్లాడుతూ అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, పానీయాలు తీసుకోవద్దని, ముఖ్యంగా ఒంటరిగా నివసించే వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వరుస నేరాలకు పాల్పడుతున్న కిలాడీ దొంగను పట్టుకున్న ముసునూరు పోలీసులను జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు.








