ఏలూరు, డిసెంబరు 30: 2026 సీజన్‌కు సంబంధించి కొబ్బరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) కొబ్బరి రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని, ఇది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె. శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
మంగళవారం ఏలూరు పవర్‌పేటలోని అన్నే భవనంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొబ్బరి మద్దతు ధరపై ఆయన మీడియాతో మాట్లాడారు. మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్‌కు రూ.445, బంతి కొబ్బరికి రూ.400 మాత్రమే పెంచడం వల్ల రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు. మద్దతు ధర కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొబ్బరి రైతుల గోడును పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఈ ఏడాది మార్కెట్ ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొని రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం వల్ల దేశీయ కొబ్బరి రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం మూడో స్థానంలో ఉండగా, దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని, కొబ్బరి ఉత్పాదకతలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఎర్రనల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్ల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా దిగుబడులు తగ్గి రైతులు నష్టపోతున్నారని వివరించారు.
చెట్టు నుంచి కొబ్బరికాయలు కోసి గుట్టగా పోయడానికి ఒక్కో కాయకు రూ.4లకు పైగా ఖర్చు అవుతుందని, ఎకరాకు రూ.40 వేలకుపైగా పెట్టుబడి అవుతోందని తెలిపారు. మార్కెట్ మాయాజాలంలో కొబ్బరి రైతులు నలిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
2025లో మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్‌కు రూ.11,582 మద్దతు ధర ఉండగా, 2026కు కేవలం రూ.445 పెంచి రూ.12,027గా నిర్ణయించారని, బంతి కొబ్బరికి 2025లో రూ.12,100 ఉండగా 2026కు రూ.400 పెంచి రూ.12,500గా నిర్ణయించినా ఈ ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావని స్పష్టం చేశారు.
అందుకే మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.15 వేలుగా, బంతి కొబ్బరికి రూ.18 వేలుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరను పెంచాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా కొబ్బరి సాగు ఉన్న జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి నేరుగా కొబ్బరికాయలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచకపోతే కొబ్బరి రైతులు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని కె. శ్రీనివాస్ పిలుపునిచ్చారు.







