ఏలూరు, డిసెంబరు 30: బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామ గిరిజనులపై అక్రమంగా బనాయించిన పోలీసు కేసులను వెంటనే ఎత్తివేయాలని, రెవెన్యూ–పోలీస్ అధికారులు దౌర్జన్యంగా దున్నేసిన గిరిజనుల పంటకు తగిన నష్టపరిహారం చెల్లించాలని, అలాగే అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడు ఎం. అప్పలరాజుపై బనాయించిన పీడీ యాక్ట్‌ను ఉపసంహరించి జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు గిరిజనులపై పోలీసు నిర్బంధం ఆపాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన భూ సమస్యలను పరిష్కరించాలని, రైతు నాయకుడు అప్పలరాజును తక్షణమే విడుదల చేయాలని నినాదాలు చేశారు.
ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.ఎన్.వి.డి. ప్రసాద్, నగర కార్యదర్శి పి. రవికుమార్, రైతు కూలీ సంఘం (ఏపీ) నాయకులు ఎస్.కె. భాషా, ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ. శ్యామల రాణి మాట్లాడారు.
ఏజెన్సీ గిరిజన చట్టాలకు విరుద్ధంగా జంగారెడ్డిగూడెం ఆర్డీవో తప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్ జారీ చేయడం దారుణమని వారు విమర్శించారు. జీవో 1049 ప్రకారం ఏజెన్సీ భూ సమస్యల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. అయినప్పటికీ చట్టాలను ఉల్లంఘిస్తూ రెవెన్యూ, పోలీస్ అధికారులు గిరిజనేతర భూస్వాముల పక్షాన నిలబడి గిరిజనులు, వారి నాయకులపై అత్యాయత్నం, దోపిడీ, దొంగతనం వంటి తప్పుడు కేసులు బనాయించడం తీవ్రంగా ఖండించారు.
గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, దున్నేసిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు పరిశ్రమల పేరుతో రైతుల భూములను కట్టబెట్టే రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడుతున్న అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఎం. అప్పలరాజుపై పీడీ యాక్ట్ బనాయించి జైలులో నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ, నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆరోపించారు.
అప్పలరాజుపై విధించిన పీడీ యాక్ట్‌ను వెంటనే ఎత్తివేసి ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలను అణిచివేసే చర్యలకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం. ఇస్సాకు, జె. గోపి, సీపీఐ(ఎం) నాయకులు ఎస్. సత్యనారాయణ, మీసాల సత్యనారాయణతో పాటు వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







