ఏలూరు, డిసెంబరు 30: సమాచార హక్కు చట్టం (ఆర్టీఏ) అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, మంగళవారం ఏలూరులోని జిల్లా పౌరసంబంధాధికారి కార్యాలయంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు యు. సురేంద్రనాథ్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం జిల్లా పౌరసంబంధాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనాన్ని ప్రోత్సహించేందుకు ఆర్టీఏ చట్టం ఎంతో కీలకమని అన్నారు. పౌరులకు సమాచార సాధికారత కల్పించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అధికారులు సకాలంలో సమాచారం అందించి పౌరులకు సంతృప్తికరమైన సేవలు అందించాలని సూచించారు.
ఈ చట్టం ద్వారా ఎంతో మంది ప్రజలు లాభం పొందుతున్నారని, సుపరిపాలనకు ఇది మూలస్తంభమని సురేంద్రనాథ్ తెలిపారు. నిర్ణీత కాలవ్యవధిలో సమాచారం ఇవ్వకపోతే, అలసత్వం లేదా నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆర్టీఏ చట్టం ప్రకారం శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
డివిజనల్ పౌరసంబంధాధికారి శ్రీ సి.హెచ్. కనకదుర్గ ప్రసాదు లింగం మాట్లాడుతూ, ఆర్టీఏ దరఖాస్తుకు రూ.10 రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పౌరులు తమ రేషన్ కార్డు నకలును జతచేస్తే ఉచితంగా కోరిన సమాచారాన్ని పొందవచ్చన్నారు. పౌరులు తమకు అవసరమైన సమాచారానికే దరఖాస్తు చేయాలని, అనవసర సమాచారానికి దరఖాస్తులు చేస్తే అధికారులకు, దరఖాస్తుదారులకు విలువైన సమయం వృథా అవుతుందని సూచించారు.
ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ డి. లక్ష్మీ, టైపిస్టు డి. సౌరిప్రసాదు, సిబ్బంది ఆర్. మల్లిబాబు, ఎస్. గంగాధర్, పి. సాగర్, వి. సాధ్యకమల, పి. శారద, వి.ఎస్. ప్రభాకర రావు, యం. మరియ రేష్మ, వి.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు.







