కేరళ తరహాలో టూరిజం అభివృద్ధికి కృషి...
గత ఏడాది కన్నా ఘనంగా డ్రాగన్ పడవ, ఈత,ముగ్గుల పోటీలు...
కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు.
ఆంధ్ర ప్రదేశ్, డా. అంబేద్కర్ కోనసీమ: కేరళ తరహా అందాలు ప్రతిబింబించే కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకువెళ్లడం కోసం డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలి పటాల పోటీలు నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం ఆత్రేయపురంలో జరిగిన పోటీలకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు, పాలూరి సత్యానందం పాల్గొని ప్రసంగించారు.
గత ఏడాది కన్నా పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ఏడాది జరిగిన పోటీలు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని అన్నారు. ఆత్రేయపురంలో తాడిపూడి, లొల్ల లాకుల వద్ద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్, రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గోదావరి, వశిష్ట నదుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పరంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు.
మహిళలు, పిల్లలు అందరూ పాల్గొనేలా ఆత్రేయపురం ఉత్సవంలా జరిపిస్తామన్నారు. లొల్ల లాకుల వద్ద సంప్రదాయ వంటకాలు అయిన ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్ళు, పిచ్చుక గూళ్ళు, పాలకోవా, మామిడి తాండ్ర మొదలైన స్థానిక రుచులతో పుడ్ పెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ప్రఖ్యాత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కేంద్రంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు.
కోనసీమలో ఎన్నో అందాలు ఉన్నాయి అని ఆయన అన్నారు. ఆత్రేయపురం కళాశాల వద్ద రాత్రి వేళల్లో సెలబ్రిటీలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


