డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: గత 20 రోజులుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం రాఘవలపేట సమీపంలో సముద్ర భూగర్భం నుంచి అక్రమంగా బొండుమట్టి, ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సీఆర్‌జెడ్ (CRZ) పరిధిలోకి వచ్చే భూముల నుంచి భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి టిప్పర్ లారీలు, ట్రాక్టర్ల ద్వారా రాత్రి–పగలు తేడా లేకుండా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ అక్రమ తవ్వకాలపై ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అన్ని శాఖల అధికారులకు ముడుపులు అందుతున్నాయనే గుసగుసలు నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ నాయకుల అండదండలతోనే ఈ బొండుమట్టి–ఇసుక మాఫియా సాగుతోందన్న ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి.
సూరసేని యానం గ్రామ పరిధిలో వీఆర్‌ఓ, ఉప్పలగుప్తం మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ) పర్యవేక్షణలోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. మీడియా కథనాలు, ప్రజల ఫిర్యాదులు, మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం అందించినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రాఘవలపేట గోదావరి నదీ పాయ బ్రిడ్జికి కేవలం పది మీటర్ల దూరంలోనే తవ్వకాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. బొండుమట్టి, ఇసుక తవ్వకాల వల్ల సముద్రతీరం దిశ మారి నదీ కోత తీవ్రంగా పెరిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నదీ కోత వల్ల తమ సారవంతమైన భూములు నది గర్భంలో కలిసిపోతాయేమోనని భయపడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రేవులను మూసి, ఇసుక నిల్వ కేంద్రాల ద్వారా మాత్రమే సరఫరా చేయాలని గనుల శాఖ నిర్ణయించినప్పటికీ, ఉప్పలగుప్తం మండలంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. జూన్ 1 నుంచి ఇసుక తవ్వకాలపై నిషేధం ఉండగా, జూన్ 8 నుంచి గోదావరి నదీతీరంలో తవ్వకాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా గాలికొదిలేసినట్టు పరిస్థితి కనిపిస్తోంది.
గ్రామస్తులు వందల సంఖ్యలో టిప్పర్ లారీలు, ట్రాక్టర్లను అడ్డుకున్నప్పటికీ గ్రామ, మండల స్థాయి అధికారులు ఎవరూ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సముద్ర భూగర్భం నుంచి బొండుమట్టి, ఇసుక తరలిస్తున్న దళారులపై, అలాగే నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ, మండల స్థాయి అధికారులపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

.jpeg)
