Hot Posts

6/recent/ticker-posts

ధర్మ పరిరక్షణ ప్రతి హిందువరి బాధ్యత : రాదా మనోహర్ దాస్



టీ. నర్సాపురం: ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ ప్రవచనకర్త రాదా మనోహర్ దాస్ అన్నారు. మతం మారితే మరణం తప్పుతుందా? అని ప్రశ్నించిన ఆయన, అలాంటప్పుడు మత మార్పిడి అవసరం ఏమిటని వ్యాఖ్యానించారు. మతం మారినా రోగాలు, కష్టాలు, బాధలు అలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. కొందరు చెప్పే మాయ మాటలను నమ్మి తప్పుదోవ పట్టవద్దని సూచించారు.


శనివారం టీ. నర్సాపురంలో నిర్వహించిన హిందూ సమ్మేళన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హిందువులంతా కుల భేదాలు పక్కనపెట్టి ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని, ప్రతి ఒక్కరూ ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.

రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మత మార్పిడులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర మతాలవారు మనకు సోదరులే అయినప్పటికీ, బలవంతపు లేదా ప్రలోభపూరిత మత మార్పిడులు సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. “ధర్మ పరిరక్షణ నాకెందుకు” అని అనుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు.


లౌకికవాదం పేరుతో హిందుత్వానికి నష్టం కలుగుతోందని రాదా మనోహర్ దాస్ అన్నారు. హిందుత్వం నిలిచినప్పుడే దేశం సుభిక్షంగా, శాంతియుతంగా ఉంటుందని చెప్పారు. మన సంస్కృతిని గౌరవించని భావజాలాలను అనవసరంగా గౌరవించాల్సిన అవసరం లేదన్నారు.

సనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైనదని, ఈ దేశంలో హిందువుగా జన్మించడం పూర్వజన్మ సుకృతమని ఆయన వివరించారు. ధర్మం నిలబడితేనే దేశం నిలబడుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి శివ గణేష్, చింతలపూడి ఖండ కార్యదర్శి సతీష్, బీజేపీ నాయకులు చాట్రాత్రి యుగంధర్, టీ. నర్సాపురం సమరస్త సేవ ఫౌండేషన్ కన్వీనర్ నార్ని వెంకటరావు, చింతలపూడి ఖండ కన్వీనర్ మరీదు వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే ఆహ్వాన కమిటీ నాయకులు పసుమర్తి రాము, ఆలయ కమిటీ చైర్మన్ అనుములు శ్రీనివాస్ రావు, అనుమోలు సంధ్యారాణి, జట్ల రాంబాబు, సాయి, విశ్వనాథ్, శ్యాంసుందర్, కాలనీటి రాంబాబు, అడపా వెంకటరావు, పూర్ణశేఖర్, రామలింగేశ్వరరావు, నాగార్జున, అయ్యప్ప తదితరులు హాజరయ్యారు.