ANDRAPRADESH, AMARAVATHI: ఆంధ్రప్రదేశ్‌లో భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గడపలు తొక్కాల్సి వచ్చేది. అయితే తాజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో *స్లాట్ బుకింగ్ విధానం* ప్రవేశపెట్టి, ఏ రిజిస్ట్రేషన్ అయినా పదివిమానాల్లో పూర్తవ్వేలా చర్యలు తీసుకుంది. ఈ విధానం అమలుతో ప్రజలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గణనీయమైన ఊరట లభించింది.
ఇదిలా ఉండగా, భూముల *మ్యూటేషన్ (పేరు మార్పు)* ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు ప్రభుత్వానికి వచ్చిన నివేదికలతో, తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అదే రోజున ఆటోమేటిక్‌గా మ్యూటేషన్ పూర్తయ్యే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అంటే ఇకపై వేరుగా మ్యూటేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
ఇంతకాలం మ్యూటేషన్ కోసం వీఆర్వోలు, ఇతర స్థానిక అధికారుల చుట్టూ తిరిగి, అవసరమైతే లంచాలు కూడా ఇవ్వాల్సి వచ్చేది. ఇది ప్రజలకు శారీరకంగా, ఆర్థికంగా భారంగా మారేది. ఇకపై ఈ సమస్యలన్నింటికీ చెక్ పడనుంది. ఇకపై రిజిస్ట్రేషన్ సమయంలోనే, సంబంధిత ఆస్తికి పన్నులు చెల్లించి ఉంటే, మ్యూటేషన్ చార్జీలతో పాటు ఒకేసారి చెల్లించి ఆటోమేటిక్ మ్యూటేషన్ పూర్తి చేసుకోవచ్చు.
ఈ విధానం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుంది. ఒకవేళ పన్ను చెల్లించి ఉండకపోతే, మ్యూటేషన్ ఆ రిజిస్ట్రేషన్ సమయంలో పూర్తవకుండా ఆగిపోతుంది. ఈ కొత్త విధానం ద్వారా భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరు రిజిస్ట్రేషన్ కాగానే అధికారికంగా కూడా ఆస్తిపై హక్కు సంపాదించగలుగుతాడు. ఇది ప్రజలకు ఒక పెద్ద ఊరటగా మారుతుంది.