తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తిస్తే అధిక దిగుబడి సాధ్యం.. జిల్లా ఉద్యానశాఖ అధికారి కె. షాజా నాయక్ సూచనలు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 24: పంటల్లో వచ్చే వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపడితే దిగుబడి నష్టాన్ని తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యానశాఖ అధికారి కె. షాజా నాయక్ తెలిపారు. రైతులకు సమగ్ర పంట సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


దెందులూరు మండలం విజయరాయి, కొండల రావుపాలెం గ్రామాలకు చెందిన రైతులు దశరథ రామయ్య, పాలడుగు సాంబశివరావు కోకో తోటలను జిల్లా ఉద్యానశాఖ అధికారి కె. షాజా నాయక్ నేతృత్వంలో ప్రాజెక్టు డైరెక్టర్ ఏపీఎంఐపీ ఎస్. రామమోహన్, శాస్త్రవేత్త సుశీల, ఐఐఓపీఆర్ విశ్రాంత శాస్త్రవేత్త కాలిదాస్ సందర్శించి పంట పరిస్థితిని పరిశీలించారు. కోకో పంటలో కోలెటోట్రైకమ్, అంట్రాక్నోజ్ వ్యాధులు మరియు పాడ్ బోరర్ పురుగు ప్రభావాన్ని అధ్యయనం చేశారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ కోకో పంటలో నలుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపించడం, పండ్లు కుళ్లిపోవడం, పూతలు ఎండిపోవడం వంటి లక్షణాలు వ్యాధి సూచనలని తెలిపారు. తోటలో గాలి, వెలుతురు సరిగా ప్రసరించేలా క్రమం తప్పకుండా కొమ్మలు కత్తిరించాలని సూచించారు. పాడైన కొమ్మలు, దెబ్బతిన్న పండ్లను తొలగించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చన్నారు.

వ్యాధి నివారణ కోసం కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా రెడోమిల్ 3 గ్రాములు లేదా కార్బెండాజిమ్ 1 గ్రామును లీటరు నీటిలో కలిపి 10–15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని సూచించారు. తోటలో నీరు నిల్వలు లేకుండా సరైన డ్రైనేజీ సదుపాయం కల్పించాలని చెప్పారు.

పాడ్ బోరర్ నియంత్రణకు దెబ్బతిన్న పండ్లను వెంటనే తొలగించి పూడ్చిపెట్టాలని, ఎకరాకు 4–5 ఫెరోమోన్ ట్రాప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే స్పైనోసాడ్ 0.5 మిల్లీ లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా సూపర్ డీ 2 మిల్లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.

సమగ్ర పురుగు నివారణ పద్ధతులు (ఐపీఎం) పాటించాలని, పూత రాలడాన్ని తగ్గించేందుకు మొక్కకు 200–250 గ్రాముల కాల్షియం క్లోరైడ్ వేయాలని సూచించారు. పంటలో ఏవైనా సమస్యలు గమనించిన వెంటనే సమీప ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి కె. షాజా నాయక్ రైతులకు విజ్ఞప్తి చేశారు.