Hot Posts

6/recent/ticker-posts

జగన్ కు మరో సన్నిహిత నేత గుడ్ బై..!?


ANDHRPRADESH:ఏపీ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. జగన్ కూటమికి కౌంటర్ గా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో లిక్కర్ కేసులో వైసీపీ నేతలు పలువురు అరెస్ట్ అయ్యారు. మరికొందరికి ఉచ్చు బిగుస్తోంది. ఇక, వైసీపీ నుంచి కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే పార్టీ వీడారు. తాజాగా మాజీ మంత్రి.. జగన్ సన్నిహిత నేత పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

వైసీపీకి గుడ్ బై

2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత పలువురు వైసీపీ ముఖ్య నేతలు పార్టీ వీడారు. అందులో రాజ్యసభ సభ్యులు.. ఎమ్మెల్సీలు.. జగన్ సన్నిహిత నేతలు ఉన్నారు. ఇక, జగన్ కేబినెట్ లో మంత్రిగా పని చేసి.. గత ఎన్నికల్లో ఓడిన మరో నేత ఇప్పుడు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ వీడేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగుతోంది. కూటమి పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నగరానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజారాజ్యం నుంచి తన రాజకీయ ప్రస్థానం చేపట్టారు. ఆ తరువాత బీజేపీ, అక్కడ నుంచి వైసీపీ లోకి వచ్చారు. జగన్ హయాంలో మంత్రిగా దేవాదాయ శాఖ పర్యవేక్షించారు. 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

మారుతున్న లెక్కలు

ఎన్నికల్లో ఓటమి తరువాత కొంత కాలం పార్టీ కార్యక్రమాల్లో వెల్లంపల్లి పాల్గొన్నారు. కొంత కాలం నుంచి ఆయన దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. గతంలో బిజెపిలో పని చేసిన సమయంలో పివిఎన్ మాధవ్ మంచి స్నేహితుడు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడంతో.. వెల్లంపల్లి ఆయన ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఇద్దరి చర్చలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, వెల్లంపల్లి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వెల్లంపల్లి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మరోసారి పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

దీంతో, 2016 లో వైసీపీలో చేరిన ఆయన 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి కోల్పోయినా.. పార్టీలో క్రియా శీలకంగా పని చేసారు. 2024 ఎన్నికల్లో వెల్లంపల్లికి ఇష్టం లేకపోయినా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. జగన్ నిర్ణయం మేరకు అసంతృప్తి తోనే ఆయన పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా, తన సొంత నియోజకవర్గం పశ్చిమలో బీజేపీ అభ్యర్ధి విజయం సాధించటంతో.. వెల్లంపల్లి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి పశ్చిమం సీటు మైనార్టీలకు కేటాయించటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. వెల్లంపల్లి తిరిగి బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. వెల్లంపల్లి తన రాజకీయ అడుగులు ఎటు వైపు అనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.