Hot Posts

6/recent/ticker-posts

ఆ పథకం పేరు మార్చండి.. నిజంగా బాగుంటుంది: షర్మిల చక్కటి సలహా..!!


ANDHRPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.

మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు అల్లాడుతున్నారని, రోడ్లపై తమ ఉత్పత్తులను తగులబెడుతూ ఆవేదన చెందుతున్నారని చెప్పారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

టీడీపీ ప్రభుత్వం ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ అని షర్మిల మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీల అర్హులను కూడా ప్రభుత్వం భారీగా కుదించిందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అందరికి కాదు..కొందరికే అన్నట్లు చంద్రబాబు పాలన కొనసాగుతోందని ఆరోపించారు.

రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉంటే.. కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది 47 లక్షల మందేనని షర్మిల అన్నారు. ఈ వడపోతల పేరుతో 30 లక్షల మంది రైతులకు చంద్రబాబు టోకరా పెట్టారని విమర్శించారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సగం మందికే ఇస్తూ, తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు కోత పెట్టి, ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పారు.

అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ఇస్తుందని ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ఊదరగొట్టారని, తీరా గెలిచాక కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో ముడిపెట్టి నాలుక మడతేశారని వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలను పక్కన పెడితే రాష్ట్ర నిధుల నుంచి చంద్రబాబు ప్రతి రైతుకు ఇచ్చేది 14,000 రూపాయలేనని చెప్పారు.

ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధం అని మాటల తూటాలు పేల్చారని షర్మిల ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి చంద్రబాబు ఇచ్చిన హామీలకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను కూడా ఆమె తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

కేంద్రం నేరుగా రైతుల అకౌంట్ లో వేస్తున్నప్పుడు చంద్రబాబు ఇచ్చినట్లు ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. రెండూ కలిసే సమస్యే లేదని అప్పట్లో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఇన్ని మాయ మాటలు చెప్పి ఇప్పుడు చంద్రబాబు కేంద్రం నిధులతో లింక్ పెట్టారని వ్యాఖ్యానించారు.

హామీలు ఇచ్చే ముందు కేంద్రం వాటాతో కలిపి అని చంద్రబాబు ఎందుకు చెప్పలేదని షర్మిల నిలదీశారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకం దేశంలో ఉన్న రైతులందరికి తప్పా కేవలం ఏపీకే కాదు కదా అని పేర్కొన్నారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు