INDIA, KARNATAKA, DHARMASTHALA: కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల’లో 1998 - 2014 మధ్య మహిళలు, మైనర్ల మృతదేహాలను ఖననం చేసి దహనం చేశారని.. వారిలో చాలా మంది లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయని.. మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోన్న నేపథ్యంలో.. తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. గురువారం కొన్ని అవశేషాలు బయటపడ్డాయి!
ధర్మస్థలలో అనుమానస్పద మరణాలపై మిస్టరీ కొనసాగుతోన్న వేళ.. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా... శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చి పెట్టిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్న చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించారు. దీంతో... ఈ కేసులో తొలి ఆధారం బయటపడినట్లయ్యిందని అంటున్నారు.
ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 'సిట్' ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సోమవారం నుంచి సిట్ అధికారులు, అతడిని వెంట తీసుకెళ్లి, అతడు చెప్పిన ప్రదేశంలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి సిట్ అధికారులు తమ పరిశోధన ప్రారంభించారు.
ఈ సమయంలో...
మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 15 చోట్లను సదరు పారిశుధ్య కార్మికుడు గుర్తించగా.. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు! ఈ క్రమంలోనే అతడు చూపించిన ఆరో ప్రాంతంలో గురువారం మానవ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో... ఆ అవశేషాలను ఫోరెన్సిక్ బృందం సేకరించి, తదుపరి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించింది. ఈ నేపథ్యంలో... డాగ్ స్క్వాడ్ ను ఆ ప్రాంతానికి రప్పించారు.
అందుతున్న సమాచారం ప్రకారం...
మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన మొదటి ఎనిమిది (1 నుంచి 8) ప్రదేశాలు నేత్రావతి నది ఒడ్డున ఉండగా.. 9 నుండి 12 ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయని చెబుతున్నారు. ఇక.. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై ఉండగా... మిగిలిన రెండు ప్రదేశాలు జాతీయ రహదారికి సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి!
ఆలయంలో 1998 నుంచి 2014 మధ్య పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఓ భయంకరమైన ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా... తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తానే స్వయంగా ఖననం చేశానని, ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, యువతులతో పాటు మైనర్ బాలికలు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తనకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా ఈ పని చేయించారని.. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని అతడు పోలీసులకు చెప్పాడు. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయం సమీపంలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశానని.. మరికొన్ని సందర్భాల్లో శవాలను నదిలోకి విసిరేసినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు.
ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో... సోమవారం నుంచి సిట్ అధికారులు అతడిని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అవశేషాలు లభ్యమయ్యాయి