HYDERABAD:తెలంగాణలో తమ ప్రభుత్వం ఇంటింటికి తిరిగి ప్రజల స్వీయ ధ్రువీకరణ పత్రంతో సేకరించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే దేశానికి రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమగ్ర వివరాలతో.. క్షుణ్నంగా చేపట్టిన సర్వేకు సంబంధించి 88 వేల పేజీల డాటా తమ వద్ద ఉందని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (SEEEPC) చేపట్టిన తీరు.. ఆ సర్వే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ఆమోదించిన బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదానికి ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఢిల్లీ ఏఐసీసీ కార్యాయలంలో గురువారం సాయంత్రం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కుల గణనకు హామీ ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024, ఫిబ్రవరి 4వ తేదీతో సర్వేను ప్రారంభించి 2025, ఫిబ్రవరి 5వ తేదీనాటికి ఏడాది కాలంలో ఆ మొత్తాన్ని పూర్తి చేశామని సీఎం తెలిపారు. అందుకే ఫిబ్రవరి 4ను తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని సీఎం వెల్లడించారు. కులగణన చేపట్టే సమయంలో అనేక మంది అగ్ర కులాల నాయకులు తన వద్దకు వచ్చి అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేశారని.. కాలనుగుణంగా మార్పులకు అవకాశం ఇవ్వాలని వారికి సూచించినట్లు సీఎం తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగాయని, అనేక మంది అమరులయ్యారని.. కానీ 2009, డిసెంబరు 9న ప్రకటన చేయడంతో పాటు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల కలను సోనియా గాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే తెలంగాణలో కుల గణనపై రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నెరవేర్చిందని సీఎం పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చెప్పినవి ఏవీ చేయరని అందుకు విరుద్ధంగా గాంధీ కుటుంబం చెప్పిన ప్రతి మాటను నిలుపుకుంటుందని చెప్పారు. కుల గణనకు సంబంధించి తమ ప్రభుత్వం 56 ప్రశ్నలతో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి వద్దకు వెళ్లి సమాచారం సేకరించిందని, సర్వే సమయంలో అందుబాటులో లేనివారికి ఆన్ లైన్ ద్వారా, టోల్ ఫ్రీ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
సర్వే ప్రకారం తెలంగాణలో బీసీలు 56.36 శాతం ఉన్నారని సీఎం తెలిపారు. సర్వేలో 3.9 శాతం మంది తమది ఏ కులం కాదని ప్రకటించుకున్నారని ఇది తెలంగాణలో సరికొత్త పరిణామమని సీఎం చెప్పారు. అదే సమయంలో వీరంతా ఎవరని సర్వే చేసిన వారు స్వతంత్ర నిపుణుల బృందం పరిశీలించగా వాళ్లంతా ఇంగ్లీష్ విద్యను అభ్యసించిన ఉన్నత విద్యావంతులన్నారు. సర్వే ప్రకారం తాము స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, విద్యా, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని తెలిపారు.
బీజేపీ తొలి నుంచి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సీఎం విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీగల్లీ కన్వెర్టెడ్ బీసీ అన్నారు. తాము కుల గణన చేపట్టమని రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో చెప్పారని సీఎం గుర్తు చేశారు. రైతుల నల్ల చట్టాల విషయంలో రాహుల్ గాంధీ గళం విప్పిన తర్వాత మోదీ వాటిని రద్దు చేసి క్షమాపణ చెప్పారని ఇప్పుడు రాహుల్ గాంధీ మాట మేరకు తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాత కేంద్రం కుల గణనకు అంగీకరించిందని ఇదంతా రాహుల్ గాంధీ ఘనతేనని సీఎం అన్నారు.
తాము చేపట్టిన సర్వే దేశానికి రోల్ మోడల్ అని ఇది తెలంగాణ మోడల్ అని, నేను దీనిని రేర్ (RARE) మోడల్ అంటున్నానని RARE అంటే ఏమిటో నేను త్వరలో వివరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకు తమ ప్రభుత్వం కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, ఇక వాటిని లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేసేందుకు రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో పోరాడాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాను, తన మంత్రులు, శాసనసభ్యులతో జంతర్ మంతర్ లో పోరాడతానని.. మీరు పార్లమెంట్ లో పోరాడాలని సీఎం కోరారు.
కుల సర్వే, బీసీ బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ స్వహస్తాలతో లేఖ రాశారని.. ఆ లేఖ తనకు నోబెల్, ఆస్కార్, జీవితకాల సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ స్థానంలో ఉన్నా లేకున్నా ఆ లేఖ తనకు ప్రత్యేకంగా మిగిలిపోతుందని సీఎం పేర్కొన్నారు.