HYDERABAD:హైదరాబాద్ లో మరో భారీ బ్రిడ్జి నిర్మితం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. దీని నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మెట్రో పాలిటన్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కే ఇళంబర్తి జీవో జారీ చేశారు.
రోడ్ కనెక్టివిటీని మరింత మెరుగుపర్చడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి ఈ బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రాత్మక మీరాలం ట్యాంక్ పై ఈ వంతెన రూపుదిద్దుకోనుంది. ఐకనిక్ బ్రిడ్జిగా నిర్మితం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దీని నిర్మాణానికి 430 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఈ వంతెన నిర్మాణంతో శాస్త్రీపురం నుంచి చింతల్‌మెట్ మీదుగా బెంగళూరు జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. జాతీయ రహదారి 44- చింతల్‌మెట్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) సమకూర్చుతుంది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) విధానంలో టెండర్లను ప్రారంభించాలని ఎమ్మార్డీసీల్ ను ప్రభుత్వం ఆదేశించింది.
భూ సేకరణ ప్రక్రియతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, ఇతర నిర్మాణ పనులు కూడా సమాంతరంగా కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ కోసం ఓపెన్ టెండర్ ద్వారా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ ను నియమించాలని MRDCLకు సూచించింది.
ఈ వంతెన డిజైన్, నిర్మాణ నమూనాలను ఈపీసీ కాంట్రాక్టర్ సమర్పించిన తరువాత.. వాటిని మొదట పీఎంసీ ఏజెన్సీ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ వరంగల్ లేదా జేఎన్‌టీయూ హైదరాబాద్ వంటి పేరున్న సంస్థలు సమీక్షించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మార్డీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.