ANDHRAPRDEASH:మంత్రులపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతీ కేబినెట్ భేటీలో పని తీరు మెరుగు పర్చుకో వాలని సూచిస్తున్నారు. అయినా, మార్పు రావటం లేదు. దీంతో.. ఈ సారి సీరియస్ అయ్యారు. రోజులు లెక్క పెట్టుకోవాలని హెచ్చరించారు. కొత్త మంత్రులు వస్తారని తేల్చి చెప్పారు. కేబినెట్ మంత్రుల పని తీరు చంద్రబాబు అంచనాలను అందుకోవటం లేదు. కొందరి వ్యవహార శైలి పైన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే ప్రచారం మొదలైంది. అయిదుగురు మంత్రులపై వేటు తప్పదంటూ ప్రచారం సాగుతోంది.
చంద్రబాబు సీరియస్
మంత్రుల పని తీరుపైన ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు. కేబినెట్ భేటీలో అధికారిక అజెండా పూర్తయిన తరువాత రాజకీయ అంశాల పైన చర్చించారు. ఆ సమయంలో చంద్రబాబు మంత్రుల పై సీరియస్ అయ్యారు. ఇప్పటికే పలు మార్లు మంత్రులను చంద్రబాబు హెచ్చరించారు. అయినా మార్పు లేకపోవటంతో.. ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని తేల్చి చెప్పా రు. ఒక్క మంత్రి పనితీరు కూడా ఆశించిన మేరకు లేదని ఆయన అన్నట్లు సమాచారం. సరైన విధంగా మంత్రులు స్పందించడం లేదని, కొందరు మంత్రులైతే తమ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడటం లేదని ఆయన అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే 1995 నాటి సిఎంను మళ్లీ చూస్తారని చెప్పారు. శాఖల నిర్వహణలో కూడా చాలామంది వేగం చూపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రక్షాళన
కాగా, కొందరు మంత్రుల పని తీరు పైన చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. మీడియాలో కొందరు మంత్రుల శాఖల పైన వస్తున్న కథనాలపై ఇప్పటికే నిఘా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలు స్తోంది. అటు మెగా బ్రదర్ నాగబాబుకు కేబినెట్ లో అవకాశం కల్పించాల్సి ఉంది. ఇటు కొందరు మంత్రుల తీరు పైన చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీ ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారని మొదట భావించారు. అయితే ఇప్పుడు విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా కొందరిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పించే దిశగా పునర్వ్యవస్థీకరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాగబాబు తో పాటుగా మరో బీజేపీ మంత్రికి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. ఇక, ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రికి ఉద్వాసన తప్పదనే ప్రచారం సాగుతోంది.
లాస్ట్ ఛాన్స్
రాయలసీమకు చెందిన మరో మంత్రి పైన ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ నేతలతోనూ ఆ మంత్రి సన్నిహితంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు మంత్రి అయిన మరో నేత తీరు పైన పార్టీ శ్రేణులు ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదని ఆ మంత్రి పైన పార్టీ నేతలే ఆగ్రహంతో ఉన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు నిఘా రిపోర్ట్స్ అందినట్లు సమాచారం. గోదావరి జిల్లాలకు చెందిన మరో మంత్రి పై తొలి నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా, వీరిని తప్పిస్తే కేబినెట్ లో సామాజిక సమీకరణాల కు అనుగుణంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.దీంతో, వీరి పైన చంద్రబాబు మరి కొంత కాలం వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తారా.. ప్రచారం సాగుతున్న ట్లుగా శ్రావణ మాసంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందా అనేది ఉత్కంఠ పెంచుతోంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi