ANDHRAPRADESH:ఇక ఏడాదిలో కనీసంగా అరవై రోజుల పాటు శాసన సభ జరిగితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని విపక్షాలు కోరుతూ వచ్చేవి.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలు బాగానే జరుగుతున్నాయి. ప్రత్యేకించి చూస్తే బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహిస్తున్నారు. అలాగే తుచ తప్పకుండా వర్షాకాల శీతాకాల సమావేశాలు కూడా జరుపుతున్నారు. దాంతో శాసన సభ పనిదినాలు ఎక్కువగానే నమోదు అవుతున్నాయి.
ఇక ఏడాదిలో కనీసంగా అరవై రోజుల పాటు శాసన సభ జరిగితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని విపక్షాలు కోరుతూ వచ్చేవి. అయితే బడ్జెట్ కి ముప్పయి రోజులు మిగిలిన వాటికి మరో ముప్పయి రోజులు కేటాయించి సభను నడిపితే చాలా అంశాలు చట్టసభలలో పరిష్కారానికి నోచుకుంటాయి.
కూటమి ప్రభుత్వం అయితే బడ్జెట్ సమావేశాలను ముప్పయి రోజులు వర్షాకాల శీతాకాల సమావేశాలను కూడా చెరి పది రోజులకు తక్కువ కాకుండా నిర్వహిస్తోంది. దాంతో ఇది మంచి పరిణామమే అని అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో చూస్తే కనుక అసెంబ్లీలో అంతా ఏకపక్షంగానే సాగిపోతోంది. సభలో మొత్తానికి మొత్తం 164 మంది ఎమ్మెల్యేలతో కూటమే పరచుకుని ఉంది. కేవలం 11 మంది మాత్రమే విపక్ష వైసీపీకి ఉన్నారు.
దాంతో వైసీపీకి సభకు హాజరు కావడం లేదు. బడ్జెట్ సెషన్ కి మాత్రం హాజరవుతూ జగన్ గవర్నర్ ప్రసంగం తరువాత జరిగే సమావేశాలకు తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకుండా జాగ్రత్తపడుతున్నారు వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆయన కోరుతున్నారు. దీని మీద ఆయన కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పటికి రెండు బడ్జెట్ సమావేశాలు ఒక వర్షాకాల ఒక శీతాకాల సమావేశాలు కూటమి ప్రభుత్వం హయాంలో జరిగాయి. కానీ జగన్ మాత్రం వీటికి హాజరు కాలేదు. టోటల్ గా వైసీపీ సభకు దూరంగా ఉంటోంది. దీంతో ఈసారి ఆగస్టులో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ సమావేశాలు పది రోజుల పాటు జరుగుతాయని ఆయన చెప్పారు.
ఆగస్టులో 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల తరువాత అసెంబ్లీ రైనీ సెషన్ ఉండవచ్చు అని అంటున్నారు. అయితే ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా అన్నదే చర్చగా ఉంది. జగన్ వైఖరి చూస్తే తొలి ఏడాది కంటే రెండవ ఏడాది బాగా యాక్టివ్ అయ్యారు. జనంలోకి వెళ్తున్నారు అదే సమయంలో కూటమి ప్రభుత్వానికి హానీ మూన్ పీరియడ్ ముగిసింది అని పార్టీ సమావేశాలలో చెబుతున్నారు.
దాంతో ఏడాది పాలనలో తప్పులు జరిగాయని ప్రజా వ్యతిరేకత నిండుగా ఉందని నమ్ముతున్న జగన్ సభకు వస్తారా అన్న చర్చ సాగుతోంది. జిల్లాల టూర్లలో తాను తెలుసుకున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే జన సామాన్యంలో మాత్రం జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని అభిప్రాయం ఉందని చెబుతున్నారు. అంతే కాదు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్ళాలని భావిస్తున్నారు. మరి ఈసారి జగన్ కనుక తన డెసిషన్ మార్చుకుంటే వర్షాకాల సమావేశాల్లోనే హీట్ పెరగడం ఖాయం. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Shakir Babji Shaik
Editor | Amaravathi