ANDHRAPRADESH:తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న వాటికి వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉంటోంది. దీంతో, కొన్ని రైళ్లకు అదనపు కోచ్ లు ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని కొత్త వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాల నుంచి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ నుంచి బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. షెడ్యూల్ ప్రకటించారు. అయినా, ఇంకా పట్టాలెక్కలేదు. ఎం జరుగుతోంది.. ఆలస్యం వెనుక కారణాలేంటనేది ఇప్పుడు చర్చగా మారింది.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా
తెలుగు రాష్ట్రాల్లో ప్రకటించిన మార్గాల్లో వందేభారత్ రైళ్లు పట్టాలెక్కాయి. అయితే, కొత్త రైలు ఖరారు చేయటం.. నెంబర్ కేటాయింపు.. షెడ్యూల్ ప్రకటించిన తరువాత కూడా విజయవాడ నుంచి బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ రైలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఈ రైలు ద్వారా కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు.. నాలుగున్నార గంటల్లోనే తిరుపతి చేరుకునేలా షెడ్యూల్ ఫిక్స్ చేసారు. దీంతో, ఈ రైలు కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణీకు లు నిరీక్షిస్తున్నారు. విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందేభారత్ నడుస్తోంది. బెంగళూరు కు కేటాయించాలనే వినతి మేరకు రైల్వే అధికారులు మే నెలలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. ఇప్పటికీ ఈ రైలు పట్టాలెక్కకపోవటం వెనుక అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.
ఫలించని నిరీక్షణ
ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు ప్రయాణం ఇతర రైళ్ల కంటే 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవ నుందని వెల్లడించారు. నాలుగున్నార గంటల్లో తిరుపతికి కాగా, ఈ రైలుకు నెంబర్ తో పాటుగా రూట్.. షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ ట్రైన్ (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి తెనాలి 5.39, ఒంగోలు 6.28, నెల్లూరు 7.43, తిరుపతి 9.45, చిత్తూరు 10.27, కాట్పాడి 11.13, కృష్ణరాజపురం 13.38, ఎస్‌ఎంవీటీ బెంగళూరుకి 14.15 గంటలకు చేరు తుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యా హ్నం 14.45 గంటలకు స్టార్ట్ అయి విజయవాడకు 23.45 గంటలకు చేరుకునేలా షెడ్యూల్ సైతం ఖరారు చేసారు.
ఆలస్యం వెనుక
అయితే, ఈ రైలు ఇప్పటి వరకు పట్టాలెక్క లేదు. ఈ రైలు అందు బాటులోకి రావటం ద్వారా తిరుపతి.. బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు వెసులుబాటు కలగనుందని ప్రయాణీకులు ఎదురు చూస్తున్నారు. విజయవాడ నుంచి బెంగళూరు, తిరుపతికి ప్రయివేటు బస్సు ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో అధిక ధరలతో సర్వీసులు నడుపుతున్నారు. ఈ వందేభారత్ పట్టాలెక్కితే ఈ అధిక ధరల భారం తప్పుతుందని ప్రయాణీకులు ఆశించారు. వందేభారత్ పైన నిర్ణయం తీసుకొని మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటికీ ఈ రైలు అందుబాటులోకి రాకుండా ఉండటానికి కారణాలు ఏంటీ.. ఎవరు అడ్డుకుంటున్నారు.. ఏం జరుగుతోందనే చర్చ ప్రయాణీకుల్లో మొదలైంది. మరి, రైల్వే అధికారులు ఎప్పుడు ఈ రైలు ప్రారంభిస్తారనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi