Hot Posts

6/recent/ticker-posts

తీవ్ర ఆర్ధిక ఒత్తిడిలో ఏపీ.. ? కాగ్ లెక్కలతో జగన్ ట్వీట్..!


ANDHRAPRADESH:ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోతోందంటూ అప్పట్లో విపక్ష టీడీపీ,జనసేన విమర్శలు చేసేవి. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిపోయింది. రెండో ఏడాది తొలి త్రైమాసికం పూర్తయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని వివరిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్దిక పరిస్ధితిపై కాగ్ విడుదల చేసిన లెక్కలతో ఆయన ఈ ట్వీట్ చేశారు.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక ఒత్తిడి తీవ్రమైందంటూ జగన్ ట్వీట్ చేశారు. ఇందులో కాగ్ తొలి త్రైమాసికానికి నెలవారీ లెక్కలతో గణాంకాలు అప్ లోడ్ చేసిందని తెలిపారు. ఈ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వం అనిశ్చితిని స్పష్టంగా సూచిస్తున్నాయని జగన్ ఆరోపించారు. విభజిత ఏపీకి ఆర్దిక నిర్వహణ సవాలుతో కూడుకున్నదని, సంక్షేమం, అభివృద్ధి అవసరమైన రంగాలలో సరైన ప్రభుత్వ వ్యయం మాత్రమే ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నారు.

తీవ్ర అవినీతి కారణంగా వివిధ అంశాల్లో రాష్ట్ర ఆదాయాల్లో నిరాశాజనక వృద్ధి కనిపిస్తోందన్నారు. తొలి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు, పన్నుయేతర ఆదాయాలు రెండింటిలోనూ నిరాశాజనకమైన స్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలలో కొన్ని వర్గాలలో అతి తక్కువ వృద్ధి, మరికొన్నింటిలో ప్రతికూల వృద్ధి స్పష్టంగా కనిపిస్తున్నందున, రాష్ట్రం ఆర్థిక ఉత్సాహం కోల్పోయిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

జీఎస్టీ, అమ్మకపు పన్ను వినియోగాన్ని ప్రతిబింబిస్తాయని, కాగ్ విడుదల చేసిన లెక్కల్లో ఇది స్పష్టంగా తెలుస్తుందన్నారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయని, ఈ సమయంలో వార్షిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉందని జగన్ గుర్తుచేశారు. రాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయని, కేంద్రం నుండి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14శాతం పెరిగాయని వెల్లడించారు.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే 15.61 శాతం వేగంతో రుణ పెరుగుదల చోటు చేసుకుందన్నారు. అందువల్ల, ప్రభుత్వ ఖర్చుల రోసం రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయాలు కాకుండా ఇతర వనరులపై ఆధారపడుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని జగన్ వెల్లడించారు.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi