Hot Posts

6/recent/ticker-posts

శుభవార్త: తిరుమల శ్రీవాణి ట్రస్ట్ తరహాలో యాదగిరిగుట్ట గరుడ ట్రస్ట్, యాదగిరి టీవీ, మాసపత్రిక!


HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తిరుమలలోని శ్రీవారి ఆలయం తరహాలో అభివృద్ధి చేయాలని, నిర్వహణ కూడా శ్రీ తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తిరుమలలో ఏర్పాటుచేసిన శ్రీవాణి ట్రస్టు తరహాలో యాదగిరిగుట్ట లో గరుడ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.

గరుడ ట్రస్ట్ ద్వారా గరుడ టికెట్.. ధర, సౌకర్యాలు ఇలా 

ఇక గరుడ ట్రస్ట్ ద్వారా ఇచ్చే గరుడ టికెట్ ధర 5 వేల రూపాయలుగా నిర్ణయించినట్టు ఒక టికెట్ పైన ఒకరికి మాత్రమే అవకాశాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు. గరుడ టికెట్ తీసుకున్న భక్తులు ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి పవళింపు సేవ వరకు ఏ సమయంలోనైనా గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ అనుమతి రాగానే గరుడ ట్రస్ట్ సేవలు 

గరుడ టిక్కెట్టు తీసుకున్న వారికి అంతరాలయ ప్రవేశంతో పాటు వేద ఆశీర్వచనం ఇస్తామని, అభిషేకం లడ్డూలు, కేజీ పులిహోర తో పాటు కొండపైకి వాహనాన్ని ఉచితంగా అనుమతిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే గరుడ టికెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.

త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక తో పాటు, టీవీ ఛానల్ 

ఇవి మాత్రమే కాదు త్వరలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వై టి డి పబ్లికేషన్ సంస్థ తరఫున యాదగిరి ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక తో పాటు, టీవీ ఛానల్ ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఈవో వెంకట్రావు ప్రకటించారు. స్వామివారికి సంబంధించి ప్రతి రోజు జరిగే ఆర్జిత సేవలు నిత్య కైంకర్యాలు, విశేష పూజలు ప్రజలందరూ ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు వీక్షించే లాగా ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

యాదాద్రి ఆలయంలో గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ 

అలాగే యాదాద్రి స్వామివారి విశేషాలను తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించే విధంగా ఆధ్యాత్మిక మాసపత్రికను మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు త్వరలోనే యాదాద్రి ఆలయంలో గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఆలయానికి సంబంధించి కరెంట్ బిల్లుల కోసం ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అందుకే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్టును ప్రవేశపెడుతున్నామని ఆయన అన్నారు. మొత్తం 20 కోట్ల రూపాయలతో నాలుగు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, మరో నాలుగు మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi