మెట్రో రైలు రెండవ దశకు కేంద్ర అనుమతులకు ప్లాన్
ఈ సదస్సులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనగా, రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు హాజరై మెట్రోరైలు రెండవదశకు కేంద్రం నుంచి అనుమతులు పొందాలంటే ఏం చేయాలి అన్న దానిపైన సమగ్రంగా చర్చించారు. జూలై 21వ తేదీనుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, పార్లమెంటు సమావేశాల వేదికగా మెట్రోరైలు రెండవదశ విస్తరణకు సంబంధించి కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని మంత్రులు ఎంపీలకు సూచించారు.
మెట్రో రైల్ రెండవ దశపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
రెండో దశ విస్తరణ కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలా పార్టీలకతీతంగా కృషి చేయాలని ఎంపీలను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు హెచ్ఏఎంఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రైలు ప్రతిపాదిత విస్తరణ కారిడార్ల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు సమగ్రంగా అర్థమయ్యేలా వివరించారు. రెండవ దశ మెట్రో విస్తరణను 2a, 2b అనే రెండు భాగాలుగా ప్రతిపాదించినట్టు అధికారులు తెలిపారు.
కేంద్రానికి పంపిన ప్రతిపాదనల వివరాలు చెప్పిన హెచ్ఏఎంఎల్ ఎండి
2ఏ కింద ఐదు కారిడార్లు ఉండగా 76.4కిలోమీటర్ల పొడవుతో 24,269కోట్ల రూపాయల వ్యయంతో ఇది నిర్మించబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను గత నవంబర్ లోనే కేంద్రానికి పంపినట్టు తెలిపారు. అలాగే 2బి లో 86.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ కారిడార్ల కోసం 19,579కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారని, దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా జూన్ 21వ తేదీన కేంద్రానికి సమర్పించామని ఎన్విఎస్ రెడ్డి ఎంపీలకు తెలిపారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi