ANDHRAPRADESH:ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు వివిధ కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ ను ప్రారంభించారు. అంతే కాదు తొలిరోజే ఆయన వ్యూహాత్మక భాగస్వాములు, పెట్టుబడి దారులతో సమావేశం అయ్యారు. ఇందులో చంద్రబాబుకు సానుకూల స్పందన లభించింది. గతంలో అమరావతి రాజధాని కోసం పనిచేసిన సింగపూర్ సంస్థ సుర్బానా జురాంగ్ తో పాటు పలు సంస్థలు ఏపీకి గుడ్ న్యూస్ చెప్పాయి.
పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో సింగపూర్ పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేకు తెలిపారు. దీంతో ఆయన సింగపూర్ లో సీబీఎన్ బ్రాండ్ కు గుర్తింపు ఉందన్నారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాల గురించి భారత హై కమిషనర్ సీఎంకు వివరించారు. ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమి కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ విధానాలను వెల్లడించారు.
భారత్‌తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని శిల్పక్ అంబులే చంద్రబాబుకు తెలిపారు. భారత్‌లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ సీఎంకు తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని.. కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని అన్నారు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు దీనికి కారణమయ్యాయన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను భారత హై కమిషనర్‌కు సీఎం వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలోనూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయని సీఎం వివరించారు. అలాగే ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో తొలి క్యాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకించి రాయలసీమలో డిఫెన్సు, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. సింగపూర్ నుంచి భారత్‌కు పెట్టుబడులు రావాలని దీనికి ఏపీ గేట్ వేగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. మరోవైపు సింగపూర్‌లో 83 శాతం మేర పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని భారత హై కమిషనర్ తెలపగా.. ఏపీలో చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ ఆయనకు వివరించారు. అలాగే విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ఆలోచనల్ని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భారత హై కమిషనర్‌కు వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటు అవుతున్న ప్రముఖ విద్యా సంస్థల వివరించారు.
సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని సీఎంకు హైకమిషనర్ తెలిపారు. సింగపూర్ నుంచి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వివరించారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల ఉత్పత్తి, షిప్ బిల్డింగ్, పోర్టు కార్యకలాపాల నిర్వహణ, డేటా సెంటర్ల ఏర్పాటు, ఫార్మా తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ దిగ్గజ కంపెనీలు ఎస్టీటీ, కెప్పెల్, కాపిటాల్యాండ్, ఈక్వినిక్స్, పీఎస్ఏ తదితర సంస్థల విస్తరణకు అవకాశాలున్నట్లు తెలిపారు. ఏఐ, స్టార్టప్‌లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన, ఏపీ, సింగపూర్ యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యం కుదుర్చుకునే అంశంపైనా సమావేశంలో చర్చించారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా చంద్రబాబు సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు చెర్ఎక్‌లోతో భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వీరు చర్చించారు. హౌసింగ్ ఫర్ ఆల్ విధానంలో భాగంగా ఏపీలో సింగపూర్ మోడల్ హౌసింగ్ అంశంపై చర్చించారు. సింగపూర్ హౌసింగ్‌లో 83 శాతం ప్రభుత్వమే చేపట్టిందని అధికారులు వివరించారు. ఏపీలోనూ, అమరావతిలోనూ ప్రభుత్వ హౌసింగ్ కార్యక్రమాలపై సుర్బానాతో భాగస్వామ్యం, సహకారంపై ప్రధానంగా దృష్టి సారించారు. అమరావతిని భవిష్యత్ నగరంగా మార్చే క్రమంలో ప్రోగ్రాం మేనేజ్మెంట్ కన్సెల్టెన్సీగా సుర్బానా జురాంగ్ పని చేయనుంది. గతంలో అమరావతికి సిద్దం చేసిన మాస్టర్ ప్లాన్‌ను మరింత మెరుగుపరిచే అంశంపైనా సుర్బానాతో సీఎం చర్చించారు.