ANDHRAPRAFESH:తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రి భేటీ కీలకంగా మారుతోంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలే అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది కేంద్రం జలశక్తి నేతృత్వంలో జరిగే ఈ భేటీలో ఇద్దరు సీఎంలు తమ వాదనలు వినిపించేందుకు సిద్దమయ్యారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల పైన చర్చ కోరుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది అంశాలను ప్రస్తావిస్తోంది. ఇద్దరు సీఎంలు అజెండా అంశాల పైన అధికారులు.. న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, బనకచర్ల పైన తెలంగాణ కొత్త ట్విస్ట్ ఇచ్చింది.
ఢిల్లీ వేదికగా ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఆసక్తి కరంగా మారుతోంది. ఈ భేటీలో
ఏపీ ప్రభుత్వం ఏకైక అజెండాగా ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అంశమే మొదటి వరుసలో ఉండగా, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న 9 అంశాలు ఉన్నాయి. పోలవరం-బనక చర్ల అనుసంధానం ప్రాజెక్టును ఏకైక చర్చనీయాంశంగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా.. అటు తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరిన 9 అంశాలను అజెండాగా స్వీకరించారు. వాటిని క్రోడీకరించి 10 అంశాల అజెండాను కేంద్ర జలశక్తి శాఖ సిద్ధం చేసింది. బనకర్ల పై చర్చ విషయంలో తెలంగాణ తమ వైఖరి తేల్చి చెప్పింది. అయినప్పటికీ పోలవరం-బనకచర్ల అనుసంధానమే అజెండాలో మొదటి అంశంగా ఉంది.
సమావేశ అజెండాలో ఆ తర్వాత తెలంగాణ ప్రతిపాదించిన 9 అంశాలు ఉన్నాయి. దీంతో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుపై సమావేశంలో గట్టి వాదనలు వినిపించేందుకు కసరత్తు చేసారు. బనకచర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖలోని అంశాలు, ఇతర ప్రతిపాదిత అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. గతం లో చోటు చేసు కున్న పరిణామాలను చంద్రబాబు ఆరా తీశారు. 2019కి ముందు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉమా భారతి ఉన్న సమయంలో నిర్వహించిన మొదటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోని నోట్స్, జగన్ హయాంలో జరిగిన రెండో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలకు సంబంధించిన నోట్స్ అడిగి తీసుకున్నారు. గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ అభిప్రాయాలు, కేంద్ర జలసంఘం అభ్యంతరాల నేపథ్యంలో బనకచర్ల పై చర్చ అసంబద్ధమని తెలంగాణ వాదిస్తోంది. దీంతో, ఈ భేటీ వేళ ఇతన నీటి అంశాల పైన ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ కీలకంగా మారుతోంది.