ANDHRAPRADESH:ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెడుతోందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. తమకు నచ్చిన వాళ్లతో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు ఫిర్యాదులు చేయించి కేసులు పెడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగిస్తున్నారని జగన్ మండిపడ్డారు. తన పర్యటనల్లో ప్రభుత్వం పెడుతున్న కేసులు, తమ పార్టీ నేతలపై నమోదు చేస్తున్న కేసులపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో మోడీ, అమిత్ షాలపైనా మాజీ బీజేపీ కార్యకర్తలతో ఫిర్యాదులు చేయించి వాటి ఆధారంగా కేసులు పెట్టేలా ఉన్నారని జగన్ హెచ్చరికలు చేశారు. అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారని, అన్ని కేసుల్లోనూ తప్పుడు వాంగ్మూలాలే కీలకంగా ఉంటున్నాయన్నారు. దేశంలో ఎవరినైనా అరెస్టు చేయొచ్చని చంద్రబాబు చూపిస్తున్నారని, మోడీయే కాదు ఎవరికీ ఇందులో మినహాయింపు లేదన్నారు.
వైసీపీ అధ్యక్షుడిపైనా అయినా, తమ పార్టీకి చెందిన గ్రామ, రాష్ట్ర స్థాయి నాయకులు, సోషల్ కార్యకర్తలపైనా ఇదే సంప్రదాయం ఫాలో అవుతున్నారని జగన్ ఆరోపించారు. ఇదే సంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చాక దెబ్బలు తిన్న వీళ్లు అనుసరిస్తే, ప్రతిచర్యకు దిగితే మీ పరిస్ధితి ఏంటని టీడీపీని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టవుతుందని గుర్తుచేశారు. తప్పుడు సంప్రదాయం మానకపోతే ఎవరి చేతుల్లోనూ వ్యవస్థ ఉండదన్నారు. చాలా అంటే చాలా తప్పు చేస్తున్నారని చంద్రబాబును విమర్శించారు.
ఇవాళ దెబ్బతిన్న వాళ్లు రేపు తమ ప్రభుత్వంలో ఇదే కొనసాగిస్తే టీడీపీ, చంద్రబాబు పరిస్ధితి ఏంటన్నారు. ఎల్లకాలం ఇవే రోజులు ఉండవని, ఇవాళ పైన మీరున్నారని, మరో మూడు, నాలుగేళ్లలో మీరు కిందకు వస్తారు, మేం పైకి వెళ్తామన్నారు. కానీ ఈ చెడు సంప్రదాయం రేపు విషవృక్షం అవుతుందన్నారు. తాను చెప్పినా తమ వాళ్లు రేపు వినే పరిస్ధితి ఉండదన్నారు. దెబ్బ తగిలిన వాళ్లకు ఆ బాధ్య తెలుస్తుందన్నారు. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సంప్రదాయం సరిదిద్దుకో అని జగన్ సూచించారు.
చంద్రబాబు సూపర్ సిక్స్ లు, సెవెన్ లు, ఐదు లక్షల మంది పెన్షన్లు పీకేసినా వాటి గురించి అడక్కూడదనే ఇదంతా చేస్తున్నారన్నారు. రైతు భరోసా ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు. దాని గురించి ఎవరూ మాట్లాడకూడదు, అడక్కూడదనే ఇదంతా చేస్తున్నారన్నారు. ప్రతీ మహిళకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారని, గతేడాది ఎగ్గొట్టి, ఈ ఏడాది కూడా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఏటా మూడు సిలెండర్లు అని చెప్పి గతేడాది రెండు ఎగ్గొట్టేశారన్నారు. వీటిపైనా ప్రశ్నించకూడదన్నారు. తల్లికి వందనంతో 15 వేలు ఇస్తామని రెండు వేలు ఎగ్గొట్టి వేల మందికి ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేలు ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు.