HYDERABAD:రోజులు మారుతున్నాయి.. మనుషుల ఆర్ధిక పరిస్థితులు మారుతూనే ఉన్నాయి. కానీ అమ్మ ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఒక మహిళగా తన కుటుంబానికి అండగా ఉంటూనే.. ఒక అమ్మగా తన బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటున్న మాతృమూర్తులు ఎందరో. రోజు గడవటమే కష్టమైన చాలా మంది మహిళలు తమ కుటుంబం కోసం ప్రసవమై పట్టుమని నెలరోజులు కాకమందే చంటి బిడ్డను చంకనేసుకుని కూలి పనులకు వెళ్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో దశాబ్దాలుగా ఇలాంటి హృదయాన్ని కదిలించే సంఘటనలు మన మనసును చివుక్కుమనిపిస్తున్నాయి.
మండుటెండలో తాను చెమటలు చిందిస్తూ..చంటి బిడ్డలను ఊయలలో వేసి కూలి పనులు చేసుకుంటున్న తల్లులు ఎందరో. బిడ్డకు ఆకలేసినప్పుడు వెళ్లి పాలుపట్టి మళ్లీ తిరిగి పనిలో నిమగ్నమవుతున్న మహాతల్లులను చూస్తే జాలేస్తుంది.పొలం పనులు దగ్గర నుంచి చెత్తఏరుకునే వరకు ఇలాంటి ఉదంతాలు కొకొల్లలు. అలాంటి ఓ సంఘటన వన్ ఇండియా కెమెరా కంట పడింది.
చెత్తకుప్పే చిన్నారులకు పాన్పు..
భాగ్యనగరాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం శ్రమించే జీహెచ్ఎంసీ కార్మికులలో ఒక మహిళ గాథ ఇది. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించడం ఆమె రోజువారి పని. ఈమెలా రోజు చెత్త సేకరించి డంపింగ్ యార్డ్ కు చేర్చే ప్రక్రియలో ఎంతో మహిళా కూలీలు భాగస్వాములు. ఈ మహిళా కార్మికులంతా తమ తమ పిల్లలతో.. డంపింగ్ యార్డ్ వద్దకు వస్తుంటారు. అక్కడ చెత్తను వేరు చేసే ప్రక్రియను.. తమ చేతులతో నిర్వహిస్తుంటారు. ఇలా ఈ మహిళ కూడా తమ బిడ్డను ఊయ్యాలలో పడుకోపెట్టి.. తన పని చేసుకుంటున్నారు. పక్కన చెట్టుకు చీరతో ఉయ్యాల కట్టి అందులో పాపను పడుకోబెట్టారు. దీంతో చెత్త కుప్పే ఆ బిడ్డకు పాన్పు అయింది. ఆ చెత్త వాసనే సుగంధ పరిమళాలుగా మారింది.
అయితే ఇంటి వద్ద ఎవరు లేక తమ పిల్లలను డంపింగ్ యార్డు తీసుకొస్తున్నట్లు ఆ తల్లి చెబుతోంది. తమ జీవితాలు ఈ చెత్తలోనే గడిచిపోతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని.. తమ పిల్లల జీవితాలు కూడా ఇలా కావొద్దని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పిల్లలను బాగా చదివించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తమకు ఇల్లు లేదని.. అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపారు. తమకు రోజుకు రూ.300 వరకు కూలి వస్తుందని వివరించింది.
వేరే మార్గం లేక...
పని ప్రదేశాలకు చిన్నపిల్లలను తీసుకురావద్దని కార్మికశాఖ నిబంధనలు ఉన్నప్పటికి.. చాలా మంది పసిబిడ్డలను ఇంటి వద్ద వదలలేక పని ప్రదేశానికి తీసుకువస్తుంటారు. ప్రతి చిన్నారికి మొదటి 5 సంవత్సరాలు చాలా కీలకం.. ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఇలా చెత్త ఎత్తిన చేతులతో బిడ్డను ఎత్తుకుని ఆ తల్లి పాలు పడితే.. ఎంతో ప్రమాదకరమైన క్రిములు, ఫంగస్ వంటికి చిన్నారిపై ప్రభావం చూపే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కానీ వారికి వేరే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే ముందు మా పరిస్థితులు మారాలని ఆ దంపతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఖండాలు దాటినా.. అమ్మ ప్రేమకు వెల కట్టలేము.. కడుపు కాలుతున్నా కన్నబిడ్డ కోసం వారు చేసే త్యాగ్యాలను ఒక చిన్న మాటలో వర్ణించలేము. ఎందుకంటే చెత్త కుప్ప వాసన ఈ చిన్నారుల దేహాల నుంచి పరిమళిస్తున్నా.. వారంతా కూడా భరతమాత ముద్దు బిడ్డలే. ఆ తల్లులంతా భరతమాతలే. వారందరికి ఇదే మా సలాం.

Shakir Babji Shaik
Editor | Amaravathi