HYDERABAD:రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్ ప్రెస్ సర్వీసులు, ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంటారు.
ఈ క్రమంలో తాజాగా మరో డైలీ ఎక్స్ ప్రెస్ ను ప్రవేశపెట్టారు. కాచిగూడ నుంచి రాజస్థాన్ లోని భగత్ కీ కోఠి మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది. శనివారం పట్టాలెక్కబోతోంది. కాచిగూడలో ఈ రైలును మంత్రులు, రైల్వే జోన్ అధికారులు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు.
ఆదివారం నుంచి ఈ ఎక్స్ ప్రెస్ కాచిగూడలో అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజూ రాత్రి 11:50 నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 17605 డైలీ ఎక్స్ ప్రెస్ రెండో రోజు రాత్రి 8 గంటలకు భగత్ కీ కోఠికి చేరుకుంటుంది.
ఈ నెల 22వ తేదీ నుంచి ప్రతి రోజూ రాత్రి 10:30 నిమిషాలకు భగత్ కీ కోఠి నుంచి బయలుదేరే నంబర్ 17606 రెండో రోజు మధ్యాహ్నం 3:40 నిమిషాలకు కాచిగూడకు చేరుకుంటుంది.
నిజామాబాద్, నాందెడ్, పూర్ణ, హింగోలి, వాషిమ్, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇటార్సి, నర్మదాపురం, రాణి కమలాపతి, సంత్ హిర్దారామ్ నగర్, సీహోర్, మక్సీ, ఉజ్జయిని, రట్లాం, జవోరా, మందసౌర్, నీమచ్, చిత్తోడ్ గఢ్, భిల్వారా, బిజయ్ నగర్, నజీరాబాద్, అజ్మీర్, బీవర్, సొజత్ రోడ్, మర్వార్ జంక్షన్, పాలీ మర్వర్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
ప్రారంభం రోజు శనివారం మాత్రం ఈ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5:30 గంటలకు పట్టాలెక్కుతుంది. మిగిలిన రోజుల్లో అంటే ఆదివారం నుంచి సాధారణ సమయంలో రాకపోకలు సాగిస్తుంది. మొత్తం 12 ఎల్ హెచ్ బీ బోగీలు ఉండే ఎక్స్ ప్రెస్ ఇది. పూర్ణ, రత్లాం, అజ్మీర్, ఇటార్సి, రాణి కమలాపతిలో వాటరింగ్ చేస్తారు. ఇటార్సీ, రత్లాం, అజ్మీర్ క్లీనింగ్ స్టేషన్లుగా ఉంటాయి.

Shakir Babji Shaik
Editor | Amaravathi