HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి కి బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి మీద భక్తితో కట్నాలు, కానుకలు సమర్పించారు. పలువు రు మంత్రులు.. ప్రముఖులు బోనాలు సమర్పించిన వారిలో ఉన్నారు. బోనాలు ఉత్సవాల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యా సంస్థలకు రేపు (సోమవారం) సెలవు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణలో విద్యా సంస్థలతో పాటుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు ( సోమవారం) .. 21వ తేదీన సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే బోనాల వేళ సెలవు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఆదివారం కావటంతో సెలవు.. రేపు కూడా సెలవు ప్రకటించటంతో వరుసగా సెలవులు వచ్చాయి. ఇక.. బోనాల సందర్భంగా ఈ రోజు.. రేపు హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాలలో సోమవారం లిక్కర్ షాపులు కూడా మూసివేస్తున్నారు. తిరిగి మంగళవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు.. విద్యా సంస్థలు యధా విధిగా పని చేస్తాయి.
ఇక, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ (ఆదివారం, జులై20) ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతు న్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. సున్నితమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi