Hot Posts

6/recent/ticker-posts

మద్యం స్కామ్ ఛార్జ్ షీట్ లో జగన్ పేరు... 305 పేజీల్లో ఏముందంటే..!


గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్‌ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు.

ANDHRAPRADESH:గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్‌ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును పలుమార్లు ప్రస్థావించారు! ఈ సందర్భంగా... కొత్త మద్యం విధానం రూపకల్పన ఎలా చేశారు? ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు? ఎలా మళ్లించారు? ఎక్కడికి మళ్లించారు? అనే అంశాలను ఛార్జ్‌ షీట్‌ లో సమగ్రంగా వివరించినట్లు తెలుస్తోంది.

అవును... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 305 పేజీల ఈ ఛార్జ్ షీట్ ను కోర్టులో వేశారు. ఈ సందర్భంగా 70 వాల్యూమ్ లతో కూడిన వేల అటాచ్డ్ డాక్యుమెంట్స్ ని జతపరిచారు! ఈ క్రమంలో దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ ఛార్జ్ షీట్ ల్లో జగన్‌ ప్రమేయంపై స్పష్టత రానుందని అంటున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు 40 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా చేర్చగా.. తాజాగా మరో 8 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో మొత్తం 16 మందిపై అభియోగాలు మోపారు. ఈ సందర్భంగా... ఛార్జ్ షీట్ లో జగన్ ను నిందితుడిగా చేర్చనప్పటికీ.. ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్‌ పేరు ప్రస్తావించారు. 

ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో.. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెలా సుమారు రూ.50-60 కోట్లు ఎలా వసూలు చేసేవారు? అందులో ఎవరెవరు భాగస్వాములయ్యారు? ఈ ముడుపుల సొమ్ము ఎక్కడ నిల్వ చేశారు? ఎక్కడెక్కడికి, ఎవరెవరు, ఎలా ఎలా మళ్లించారు అనే వివరాలు పొందుపరిచారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా... ఈ మొత్తం వ్యవహారంలో ఏ నిందితుడి పాత్ర ఎంత ఉంది, ఎవరి ప్రమేయం ఏంటి అనేది పూర్తిగా వివరిస్తూ అభియోగాలు మోపారని అంటున్నారు. ఈ సమయంలో ఛార్జ్ షీట్ లో 104 పోరెన్సిక్ నివేదిక‌లు, 130కు పైగా ల్యాప్‌ టాప్‌ లు, పోన్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లు వంటి ఎల‌క్ట్రానిక్ డివైజ్‌ లను న్యాయస్థానానికి సమర్పించినట్లు చెబుతున్నారు. 

కాగా... మద్యం కుంభకోణంపై ఏపీ సీఐడీలో గతేడాది కేసు నమోదైందన సంగతి తెలిసిందే. దీని దర్యాప్తు కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 5న విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 'సిట్‌' ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో.. ఇప్పటివరకూ 12 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇందులో భాగంగా.. తొలుత ప్రధాన నిందితుడు రాజ్‌ కెసిరెడ్డిని అరెస్టు చేసింది.

ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎస్‌పీవై డిస్టిలరీస్‌ మాజీ డైరెక్టర్‌ సజ్జల శ్రీధర్‌ రెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్, వెంకటేశ్‌ నాయుడు, నవీన్‌ కృష్ణ, బాలాజీ యాదవ్‌ లను అరెస్టు చేశారు. ఈ క్రమంలో శనివారం ఎంపీ మిథున్‌ రెడ్డిని అరెస్టు చేశారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi