ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 24: విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాలను భక్తి వైభవం, వైదిక ఘనతలతో నిర్వహించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం 12 సంవత్సరాలకు ఒకసారి ఆలయంలో దైవిక శక్తి పునరుద్ధరణ కోసం కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
కుంభాభిషేక మహోత్సవం నిర్వహణపై ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు, దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వీకే శీనానాయక్ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా కనకదుర్గమ్మ ఆలయ శిఖర విమాన గోపురానికి కుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు. పుష్కర మహానదులు, సముద్ర జలాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా మహోత్సవానికి హాజరవుతారని చెప్పారు. దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు రానున్నారని అంచనా వేస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యం – కలెక్టర్ లక్ష్మీశ
కుంభాభిషేక మహోత్సవాల సమయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. టీమ్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దసరా ఉత్సవాల సమయంలో రోజుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించామని, ఈసారి రోజుకు మూడు లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు – సీపీ
కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా తగిన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
మూడు రోజుల కార్యక్రమాల వివరాలు
ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు షణ్ముఖశాస్త్రి కుంభాభిషేక మహోత్సవాల కార్యక్రమాలను వివరించారు. భారతదేశంలోని పుణ్య నదులు, తీర్థాలు, సప్త సముద్ర జలాలతో కలశాలను సిద్ధం చేసి యాగశాలలో మంత్రోచ్ఛారణలతో పూజించిన అనంతరం కుంభాభిషేకం నిర్వహిస్తారని తెలిపారు.
మార్చి 6న యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, మూలమంత్ర హవనాలు జరుగుతాయి. మార్చి 7న అష్టోత్తర కలశస్థాపన, పీఠపూజలు, హవనాలు నిర్వహిస్తారు. మార్చి 8న ఉదయం మంటప పూజలు, మూలమంత్ర హవనాలు, పూర్ణాహుతి అనంతరం ఉదయం 9:34 గంటలకు మేషలగ్నంలో కనకదుర్గమ్మ ప్రధాన ఆలయంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు.
కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలో శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ ప్రసంగం నిర్వహించబడుతుంది.







