ANDHRAPRADESH:రాజకీయాల్లో బండ్లు ఓడలు కావడం, ఓడలు బండ్లు కావడం జరుగుతూనే ఉంది. రాజకీయాల్లో అధికారం ఉండగా తోపు, తురుము అనుకున్న వాళ్లంతా విపక్షంలోకి మారగానే చుక్కలు కనిపించడం, తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ ఆ దర్పం, హంగామా తిరిగి రావడం సహజంగా మారిపోయింది. ఇదే క్రమంలో ఏపీ రాజకీయాల్లో తాజాగా లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కలకలం రేపుతోంది. దీనికి కొనసాగింపుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతకన్నా చర్చనీయాంశమవుతున్నాయి.
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసులో సీఐడీ అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపింది. రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు సౌకర్యాల కోసం కోర్టులో ఆయన కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆయనకు ఇంటి భోజనంతో పాటు ఇతర వసతులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో రాజమండ్రిలోనే ఆయన కుమారుడు నారా లోకేష్ ఓ తాత్కాలిక ఇల్లు తీసుకున్నారు. అక్కడే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి స్వయంగా వండి జైలుకు ఆహారం తీసుకెళ్లేవారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అదే విధంగా రాజమండ్రి జైలుకు రిమాండ్ పై పంపారు. ఆయన కూడా కోర్టుకు తనకు ఇంటి భోజనంతో పాటు ఇతర సౌకర్యాలు కావాలని కోరారు. దీంతో కొడుకు మిథున్ రెడ్డికి ఈ సౌకర్యాలు కల్పించేందుకు తండ్రి పెద్దిరెడ్డి రాజమండ్రికి తాత్కాలికంగా మకాం మారుస్తున్నారు. నగరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఓ విల్లాను అద్దెకు తీసుకుని అక్కడి నుంచే మిథున్ రెడ్డికి ఇంటి భోజనంతో పాటు ఇతర అవసరమైన సామాగ్రి పంపేందుకు, ఆయన్ను ములాఖత్ లో కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో చంద్రబాబు 53 రోజుల పాటు స్కిల్ స్కాంలో రాజమండ్రి జైల్లోనే ఉన్న తర్వాత ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు బెయిల్ పైనే ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డికి కూడా లిక్కర్ కేసులో బెయిల్ లభించే వరకూ ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండాల్సిందే. దీంతో దీర్ఘకాలిక ప్లాన్ తో పెద్దిరెడ్డి ఇలా రాజమండ్రిలో విల్లా తీసుకున్నట్లు సమాచారం.

Shakir Babji Shaik
Editor | Amaravathi