Hot Posts

6/recent/ticker-posts

ఆ పథకం ఇవ్వాలంటే ఆంధ్రా అమ్మేయాలి..! మంత్రి అచ్చెన్న షాకింగ్ కామెంట్స్..!


ANDHRAPRADESH:ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయినా ఇంకా ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ తో పాటు పలు మ్యానిఫెస్టో హామీలు అమలు కాలేదని విపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో ఒక్కో పథకం అమలు చేసుకుంటూ వెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఓ కీలక పథకం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో తాము ఇప్పటికే అన్ని హామీలు నెరవేర్చామని, ఒక్క మహిళలకు నెలకు 1500 ఇచ్చే పథకం మాత్రమే అమలు చేయాల్సి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు ఓ బహిరంగసభలో తెలిపారు. తమ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగమై దీన్ని అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మేయాలంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఆ తర్వాత కోలుకుని నవ్వుల్లో మునిగిపోయారు.

మహిళలకు నెలకు 1500 ఇచ్చే మహాశక్తి పథకం ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాల్సిన అవసరం ఉందని, అంత డబ్బు అవసరం ఉందని ఏం చేయాలంటూ అచ్చెన్న ప్రశ్నించారు. దీని కోసం ఏం చేయాలనే విషయంపై సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అచ్చెన్న వెల్లడించారు. మిగతా పథకాలు మాత్రం పక్కాగా అమలు చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకంపై మాత్రం త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు

మరోవైపు మహిళలకు నెలకు 1500 చొప్పున ఇచ్చే మహాశక్తి పథకం అమలుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే దాదాపుగా తేల్చేశారు. ఈ పథకాన్ని పీ4 కార్యక్రమంలో కలిపేస్తున్నట్లు గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. దీంతో ఈ కీలక సూపర్ సిక్స్ హామీ పీ4లో భాగంగా అమలు చేస్తారని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో ఈ పథకం ఎలాగైనా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అన్న చర్చ మొదలైంది.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi