ANDHRAPRADESH,NELLURU:నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికీ మధ్య జరుగుతున్న రాజకీయ పోరు తాజాగా కీలక మలుపు తీసుకుంది. ప్రసన్నకుమార్ రెడ్డిని ఉద్దేశించి తాను పీహెచ్డీ చదివానని, ఆయన ఏం చదివారంటూ ప్రశాంతి ప్రశ్నించడం, దానికి కౌంటర్ గా ఆమె అన్నింట్లోనూ పీహెచ్డీ చేసేసిందని, అందుకే ఎంపీ వేమిరెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుందంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో నిన్న కోవూరులో నల్లపురెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయగా.. ఇవాళ వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్టిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ, జనసేన మంత్రులు ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రశాంతిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవన్నారు. ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు.
ప్రశాంతి రెడ్డిపైనా, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పైనా నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయని పవన్ తెలిపారు. మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.అధికారంలో ఉన్నప్పుడూ ఆ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారన్నారు. నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారన్నారు. అయినప్పటికీ వదరుబోతు మాటలు వదల్లేకపోతున్నారని విమర్శించారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందన్నారు.
మరోవైపు నెల్లూరు మంత్రి నారాయణ కూడా నల్లపురెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మహిళ అని కూడా చూడకుండా దారుణంగా మాట్లాడారన్నారు. గతంలో ఆ పార్టీ అధినేత సొంత చెల్లెలిపైనే నోరుపారేసుకున్నారన్నారు. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ను కలిసేందుకు వెళ్లారని షర్మిల గారిపై అసభ్యంగా మాట్లాడారని నారాయణ ఆక్షేపించారు. పార్టీ అధినేత బాటలోనే మిగిలిన నాయకులు ప్రవర్తిస్తున్నారన్నారు. మహిళల పట్ల వైసీపీ నాయకులకు ఎలాంటి అభిప్రాయం ఉందో మరోసారి బయటపడిందన్నారు. వైసీపీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi