తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయింది.
HYDERABAD:తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయింది. అయితే.. ఇప్పటికి 46 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయిన దానికీ కాని దానికీ ఆయన ఢిల్లీకి వెళ్తుండడం విమర్శలకు కారణం అవుతోంది. ఏదైనా కీలక కార్యక్రమం పెట్టుకు ని ఢిల్లీకి వెళ్లడాన్ని పెద్దలను కలుసుకునేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ.. చిన్న చిన్న పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి.. హస్తిన బాటపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
ఇక, ప్రతిపక్ష నాయకులకు ప్రధాన విమర్శల అస్త్రంగా మారిపోయింది. తాజాగా 47వ సారి కూడాసీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. సోమవారం ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్టు సీఎంవో వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. దీనిపై బీఆర్ ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో గతంలో ఇందిరమ్మ, సోనియాలు ఉన్నప్పుడు.. ఇలానే చేసేవారు. ప్రతిదీ.. వారికి చెప్పి చేయాలన్న షరతు ఉండేది.
కానీ, రాహుల్‌గాంధీ పార్టీ వ్యవహారాలను నడిపించడం మొదలు పెట్టిన తర్వాత.. సీఎంలకు స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రకటించారు. కానీ.. ఇది ప్రకటనలకే పరిమితమైంది. హైడ్రా వంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా ఢిల్లీ పెద్దల నుంచి సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని.. అప్పట్లో కలకలం రేగింది. ఇది నిజమేనని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించుకున్నారు. ఇక, ఆ తర్వాత నుంచి మరింతగా ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
తాజాగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని రాహుల్ చేతులమీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నే రేవంత్ ఢిల్లీ బాట పడుతున్నారు.కానీ, రాష్ట్ర స్థాయిలో చూసుకున్నా.. ఇది చిన్న కార్యక్రమం. ఇదేమీ శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్టు కాదు. అయినా.. రాహుల్‌ను పిలుచుకుని వచ్చేందుకు ఆయన వెళ్తుండడంపై విమర్శలు వస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. ఈ పరిస్థితిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.

Shakir Babji Shaik
Editor | Amaravathi