Hot Posts

6/recent/ticker-posts

ట్రంప్ కొట్టిన కొట్టుడుకు బంగారం రేట్లు ఎగబాకుడే


IINDIA:అమెరికా విధించిన 25 శాతం టారిఫ్ వ్యవహారం.. దేశీయ పారిశ్రామిక రంగంలో తీవ్ర కలకలానికి దారి తీసింది. ఆందోళన కలిగిస్తోంది. డొనాల్డ ట్రంప్ చేసిన ఆ ఒక్క ప్రకటనతో కలవరం మొదలైంది. ఈ టారిఫ్ వల్ల తక్షణ దుష్ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

భారత్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల వస్తువులపై 25 శాతం టారిఫ్ విధించినట్లు డొనాల్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ ద్వారా వెల్లడించారు. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, భారత్ తమతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

ఈ టారిఫ్.. దేశీయ బంగారం, వజ్రాలు, ఆభరణాల తయారీ రంగంపై తీవ్రంగా పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. జెమ్స్ అండ్ జ్యువెలరీ, డైమండ్ మేకింగ్.. వంటి ఇండస్ట్రీలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని అంచనా వేశాయి. ఈ గండం నుంచి గట్టెక్కడానికి మేకింగ్ ఛార్జీలను భారీగా పెంచే పరిస్థితులు తలెత్తుతాయని చెబుతున్నాయి.

ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ రాజేష్ రోక్డే మాట్లాడారు. ఈ టారిఫ్‌ల వల్ల భారత్, అమెరికా దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. దాదాపు 9 బిలియన్ డాలర్ల విలువ చేసే ద్వైపాక్షిక వాణిజ్య కార్యకలాపాలపై 100 శాతం ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఈ సుంకాల కారణంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ, డైమండ్, దాని అనుబంధ వస్తువుల ఎగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రాజేష్ రోక్డే అన్నారు. ఇది ఎగుమతి ఆధారిత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEలు)ను తీవ్రంగా దెబ్బకొడుతుందని భావిస్తున్నారు.

ఈ ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని వ్యూహాత్మక చర్యలు కొంత ఆశావాదాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలతో భారత్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) ఈ టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి సవాళ్లు ఎదురైనా.. భారత్ అనుసరిస్తోన్న వైవిధ్యభరితమైన వాణిజ్యం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా దీర్ఘకాలంలో ఈ రంగం కోలుకుంటుందని రాజేష్ రోక్డే పహా జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ టారిఫ్‌లు అమెరికా మార్కెట్‌పై కూడా దీర్ఘకాలిక పరిణామాలను చూపిస్తాయని, భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గి, ధరలు పెరిగి, వినియోగదారులపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ టారిఫ్ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో, భారత్ తన వ్యూహాత్మక వాణిజ్య విధానాలతో వాటిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందో చూడాలి.