Hot Posts

6/recent/ticker-posts

ఏపీలో ఉచిత బస్సు వేళ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..! నేటి నుంచే..!


 ANDHRPRADESH:ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు అధికారికంగా విడుదల కాకపోయినా ఆర్టీసీ ఎండీ, చైర్మన్ తాజాగా వీటిపై సంకేతాలు ఇచ్చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడెక్కడ అనుమతిస్తారు, ఏయే బస్సుల్లో అనుమతిస్తారన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో దాదాపు 11 వేలకు పైగా బస్సులు ఉన్నాయి. వీటిలో 74 శాతం బస్సుల్ని మహిళల ఉచిత బస్సు పథకానికి వాడతామని ఇప్పటికే ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. అయితే ఇందులో పల్లెవెలుగు, సిటీ, ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతిస్తారు. కాబట్టి ఆయా బస్సుల్లో ఇప్పటికే పని చేస్తున్న సిబ్బందికి ఇలా ఉచిత ప్రయాణం అనుమతించేందుకు కొన్ని మార్గదర్శకాలు, శిక్షణ తప్పనిసరిగా మారింది.

ఈ నేపథ్యంలో ఉచితంగా మహిళల్ని బస్సులో ఎక్కించుకుని ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు అనుసరించాల్సిన విధానాన్ని సిబ్బందికి అవగాహన కల్పించాల్సి ఉంది. రాష్ట్రంలో తొలిసారి అమలవుతున్న ఈ పథకంపై సరైన శిక్షణ లేకపోతే రేపు చాలా సమస్యలు ఉంటాయని ఆర్టీసీ అంచనా వేస్తోంది. అందుకే ఇవాళ్టి నుంచి ఆయా బస్సుల్లో సిబ్బందికి ఎక్కడికక్కడ షెడ్యూల్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. తమ స్థానిక డిపోల పరిధిలోనే ఈ శిక్షణ ఇవ్వనున్నారు.

ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు అనుమతిస్తున్నందున ఎక్కడ ఎక్కే మహిళలకు అయినా జీరో టికెట్ కొట్టాల్సి ఉంటుంది. దీనికి కండక్టర్లకు తగిన శిక్షణ లేకపోతే ఇబ్బందులు తప్పవు. అలాగే ఇలా ఫ్రీ టికెట్లు ఒకేసారి ఎక్కువగా ఇవ్వాల్సి వస్తే సాఫ్ట్ వేర్ మొరాయించే ప్రమాదం ఉంది. కాబట్టి సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయడంతో పాటు అక్కడ పనిచేసే సిబ్బందికి సైతం సమస్య పరిష్కారంపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ సక్రమంగా లేకపోతే రేపు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమయ్యాక ప్రభుత్వం విమర్శల పాలవ్వడం ఖాయం. అందుకే ఆర్టీసీ ఇవాళ్టి నుంచే ఈ శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తోంది.