HYDERABAD:రేపు(జులై 16) మధ్యాహ్నం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. బుధవారం మధ్యాహ్నం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కీలక భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, సాగునీటి ప్రాజెక్టుల వివావాదాలపై చర్చించనున్నారు. ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
బనకర్ల ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గత పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో చర్చించనున్నారు. గతంలో కృష్ణా, గోదావరి జలాల వివాదాలపై చంద్రబాబు చర్చించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ ప్రకటించారు.
ఇప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 11.45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రేపు కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం కానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత నార్త్ బ్లాక్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరనున్నారు. మొత్తంగా కృష్ణా నది, గోదావరి నదుల్లో నీటి వాటాపై, ఆ నదులపై ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చించబోతున్నారు..
అయితే గోదావరిలో ప్రతి ఏటా 2 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని.. ఆ నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకోవడంలో తప్పులేదని.. తెలంగాణ ఆ జలాలను వాడుకున్నా అభ్యంతరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని.. ఆ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. తెలంగాణలో అనుమతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా తాము అభ్యంతరం చెప్పలేదని.. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.