HYDERABAD:తాజాగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్.. బీఆర్ ఎస్ హయాంలో పేదలకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలన్న సోయి కూడా లేకుండా పోయిందన్నారు
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగా రు. తాజాగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్.. బీఆర్ ఎస్ హయాంలో పేదలకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలన్న సోయి కూడా లేకుండా పోయిందన్నారు. కనీసం.. వారికి తినేందుకు నాణ్యమైన బియ్యాన్ని కూడా ఇవ్వలేక పోయారని చెప్పారు. సాగును బాగు చేస్తామని అధికారంలోకి వచ్చిన ఒకాయన(కేసీఆర్) సాగును సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.
మూడు రోజుల్లో తుంగతుర్తి నుంచి జలాలు ఇస్తామని చెప్పి.. పదేళ్లు అయినా.. చుక్కనీటిని కూడా ఇవ్వ లేక పోయారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా ఏపీకి వెళ్లి అమ్ముకుందని.. ఇప్పుడు రేషన్ బియ్యం కోసం.. పేదలు క్యూ కడుతున్నారని తెలిపారు. మధ్యతరగతి వారు కూడా.. రేషన్ బియ్యం కోసం వచ్చే రోజులు వచ్చాయన్నారు. ఇకపై మధ్యతరగతి వర్గానికి కూడా బియ్యం కార్డులు ఇచ్చే అంశం పై పరిశీలన చేస్తామన్నారు. బియ్యం ఎవరికైనా ఇచ్చేలా మార్పులు చేస్తామన్నారు.
ఇక, నుంచి పేదలకు అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రా ష్ట్రంలో మెరుగైన పాలనతోపాటు.. అభివృద్ధికి కూడా శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. వ్యవసాయాన్ని ఒకప్పుడు దండగ అనుకునేవారని.. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయని, పండుగగా మారిందని చెప్పా రు. రాష్ట్రంలో మార్పు సాధ్యమైందని చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉదాహరణ అని పేర్కొన్నారు. గడీల పాలన నుంచి విముక్తి వచ్చిందని.. గ్రామాల్లో సంబరాలు చేసుకునే రైతన్నలు ఉన్నారని వ్యాఖ్యానించారు.