HYDERABAD:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ ప్రభుత్వం బిగ్ ఝలక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చించడానికి తాము ఎంతమాత్రం సిద్ధంగా లేమని తేల్చి చెప్పింది. బనకచర్ల సింగిల్ పాయింట్ అజెండాతో దేశ రాజధానిలో జరిగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో తెలంగాణ ఈ వాదన లేవదీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ.. లేఖ సైతం రాసింది. బుధవారం ఢిల్లీలో జరగనున్న అంతర్-రాష్ట్ర సమావేశం అజెండాలో బనకచర్ల ప్రాజెక్టును చేర్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్ట్ నిబంధనలకు విరుద్ధమని, దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.
కేంద్ర జల్ శక్తి మంత్రి సమక్షంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో ఈ సమావేశం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వం తాజాగా లేఖ రాయడం- ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహణపై సందేహాలు లేవనెత్తినట్టయింది.
82,000 కోట్ల రూపాయల గోదావరి-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం జల్ శక్తి మంత్రిత్వ శాఖకు సింగిల్ అజెండాను సమర్పించిన విషయం తెలిసిందే. తెలంగాణ మాత్రం దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వేర్వేరు అజెండాలను కేంద్రానికి పంపింది.
ఇందులో- కృష్ణా నదిపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టుల హోదా కల్పించడంతో పాటు వాటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రమే చేయడం, తుమ్మిడిహెట్టి వద్ద పూర్తయిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయింపును ఇందులో చేర్చింది.

దీనితో పాటు- త్వరితగతిన సాగునీటి పథకాల ప్రయోజన కార్యక్రమం కింద తెలంగాణకు అన్ని రకాల సహాయ, సహకారాలను అందించడం, 200 టీఎంసీల వరద నీటిని వినియోగించుకోవడానికి ఇచ్ఛంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టును నిర్మించడానికి అనుమతులు మంజూరు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
బనకచెర్ల ప్రాజెక్టుపై ఎటువంటి చర్చకు కూడా తాము సిద్ధంగా లేమని, దీనిపై చర్చించడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోన్నామని తెలంగాణ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి లేఖ పంపింది. బనకచర్ల ప్రాజెక్టుకు చట్టబద్ధమైన అనుమతులు లేనందున దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
గోదావరి-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎక్స్‌పర్ట్ అప్రైసల్ కమిటీ వంటి నియంత్రణ సంస్థల నుండి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని లేఖలో పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఎటువంటి అనుమతులు లభించలేదని, చట్టపరమైన, ట్రిబ్యునల్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని వివరించింది
బనకచర్లపై ఎటువంటి చర్చ అయినా అనుచితమని, కేంద్ర నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. చట్టపరమైన ప్రక్రియలు, అంతర్-రాష్ట్ర ప్రోటోకాల్‌లు పాటించే వరకు బనకచెర్లపై చర్చలకు సిద్ధంగా లేదని తెలంగాణ స్పష్టం చేస్తోంది.