ANDHRAPRADESH:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తలు దాడి చేశారు. వీరంగం సృష్టించారు. ఫర్నిచర్ మొత్తాన్నీ ధ్వంసం చేశారు. ఏ వస్తువును కూడా మిగలనివ్వలేదు.
సోమవారం రాత్రి నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలో నివసిస్తోన్నారు నల్లపరెడ్డి. రాత్రి దుండగులు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. విలువైన వస్తువులను ధ్వంసం చేశారు.
అంతకు ముందు కోవూరులో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. ఆ సమావేశాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేశారని, దాని తరువాతే ఈ ఘటన జరిగినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసగా ఆమె వర్గీయులు, అనుచరులు ఈ ఘోరానికి పాల్పడినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకుని పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లాలో ఓ సీనియర్ నాయకుడి నివాసంపై దాడి చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నల్లపరెడ్డి కుటుంబంపై జరిగిన మొదటి దాడి ఇది. కోవూరు నియోజకవర్గంపై నల్లపరెడ్డి కుటుంబానికి గట్టి పట్టు ఉన్న విషయం తెలిసిందే.
ప్రసన్నకుమార్ రెడ్డి అయిదుసార్లు కోవూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మూడుసార్లు తెలుగుదేశం పార్టీ, రెండుసార్లు వైఎస్ఆర్సీపీ నుంచి విజయఢంకా మోగించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి సమాచారం తెలిసిన వెంటనే నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురు వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనను పరామర్శించారు. ఈ దాడి వెనుక వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనను పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ధ్వజమెత్తారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi