సోమవారం రాత్రి నెల్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు కొండయ్యపాలెం గేట్ అంబేద్కర్ భవన్ సమీపంలోని సుజాతమ్మ కాలనీలో నివసిస్తోన్నారు నల్లపరెడ్డి. రాత్రి దుండగులు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఇష్టానుసారంగా ప్రవర్తించారు. విలువైన వస్తువులను ధ్వంసం చేశారు.
అంతకు ముందు కోవూరులో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి. ఆ సమావేశాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేశారని, దాని తరువాతే ఈ ఘటన జరిగినట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసగా ఆమె వర్గీయులు, అనుచరులు ఈ ఘోరానికి పాల్పడినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకుని పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునే లోపే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఈ దాడి సమాచారం అందిన వెంటనే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పలువురు నాయకులు.. ప్రసన్న ఇంటికి చేరుకున్నారు. జరిగిన ఘటన గురించి ఆరా తీశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనకు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. దీనికి ప్రతీకారం దాడులు తప్పవని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. తెలుగుదేశం కూటమి పాలనలో మాజీ ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి చేసి, వీరంగం సృష్టించారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని, ప్రభుత్వ పెద్దలే ఈ దాడులు జరిపిస్తోన్నారని ఆరోపించారు.
రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వంటి నాయకులు పదవుల్లో కొనసాగడానికి అర్హత లేదని, తమ పదవులకు వెంటనే రాజీనామాలు చేయాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. దీనికి ప్రతి చర్య ఉంటుందనీ ఆయన హెచ్చరించారు.
ఈ దాడి ఘటన తరువాత పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయనను పరామర్శించారు. ఫోన్ లో మాట్లాడారు. జరిగిన ఘటన గురించి ఆరా తీశారు.

Shakir Babji Shaik
Editor | Amaravathi