ANDHRPRADESH:ఏపీలో లిక్కర్ కేసు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. మరి కొందరు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సిట్ జగన్ పేరు ప్రస్తావన చేసింది. అయితే, నిందితుడుగా చేర్చలేదు. మరి కొద్ది రోజుల్లోనే మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. అటు ఈ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ సమయంలోనే జగన్ అరెస్ట్ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సమయంలోనే బీజేపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ పైన స్పష్టత ఇచ్చారు.
లిక్కర్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తరువాత ఈ కేసు కొత్త ములుపు తీసుకుంది. తాజాగా ఈ కేసులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సిట్ అనేక అంశాలను ప్రస్తావించింది. ఆధారాలను సమర్పించింది. కాగా, ఈ కేసులో జగన్ అరెస్ట్ తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటు జగన్ అరెస్ట్ పైన చర్చ జరుగుతున్న వేళ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని.. ఎవరూ ఆప లేరంటూ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లక తప్పదని చెప్పుకొచ్చారు.
జగన్ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయని.. అవి అందిరికీ తెలిసినవే అని మాధవ్ పేర్కొన్నారు. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో తాజాగా రంగారెడ్డి జిల్లా ఫాం హౌస్ లో సిట్ అధికారులు రూ 11 కోట్ల నగదును గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు లో ఏ 40 గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు జరిగాయి.
శంషాబాద్ మండలం లోని ఒక ఫాం హౌస్ లో ఈ నగదు డంప్ ను గుర్తించారు. రాజ్ కేసిరెడ్డి అనుచరుడిగా ఉన్న వరుణ్ ను సిట్ అధికారులు విచారించారు. సులోచన ఫాం హౌస్ లో ఈ మొత్తాన్ని సిట్ అధికారులు స్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది. ఇక, ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అధ్యక్షుడు జగన్ అరెస్ట్ పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.