HYDERABAD:తెలంగాణ రాష్ట్రాన్ని వాయుకాలుష్యం చుట్టుముట్టేస్తోంది. రాష్ట్రంలో గాలి నాణ్యత రోజురోజుకీ మరింత తగ్గిపోతుంది. ఇటీవల రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో గాలిలో కలుషిత స్థాయిని పరిశీలించగా.. ప్రతి ప్రాంతంలో వాయు కాలుష్యం భయంకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత కాలుష్య భయంకర ప్రాంతాలుగా రామగుండం,పటాన్ చెరు,కొత్తూరు మారుతున్నాయి. వాయు కాలుష్యంలో హైదరాబాద్ తో పోలిస్తే ఈ మూడు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గతేడాదితో పోల్చితే వాయుకాలుష్యం పెరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా వాహనాల ధ్వని, ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కాలుష్యం విస్తరిస్తోంది.
హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలోని మహా నగరాల్లో 41వ స్థానంలో ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా రోజురోజుకూ అభివృద్ధి చెందింది. భాగ్యనగరంలో జనాభా సైతం రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉంది. గతేడాదితో అంటే 2024 తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది. హైదరాబాద్ లో జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య చూస్తే 85 లక్షల 22 వేల 286 కు చేరింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ లో కలిపి ప్రస్తుతం 59 వేల 800 పరిశ్రమలు ఉన్నాయి. ఇక వీటినుంచే వచ్చే కాలుష్యం, వ్యర్థాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాతబస్తీ మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, ముంబై, చెన్నై లో వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో తలెత్తకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోర్ సిటీలోని కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ రంగ వ్యర్థాలను నగరంలో ఎక్కడపడితే అక్కడ డంపింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని మంచినీరు, మురుగు నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా మార్చేయాలని ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.