Hot Posts

6/recent/ticker-posts

గోదావరికి వరద ఉధృతి- లంక గ్రామాలకు హెచ్చరికలు


ANDHRAPRADESH:బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

ఈ అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం బంగాళాఖాతం ఉత్తరప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా కదులుతుందని, మరింత బలపడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.

వచ్చే 48 గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉత్తర ప్రాంతం వైపు కదిలేందుకు అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావడానికి అవకాశం ఉందని ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.

ఈ భారీ వర్షాల ప్రభావం గోదావరిపై తీవ్రంగా పడింది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల గోదావరికి వరద ఉధృతి భారీగా పెరిగింది. వరద నీటితో పోటెత్తుతోంది. కొత్త నీటితో కళకళలాడుతోంది. గోదావరిపై నిర్మించిన రిజర్వాయర్లన్నీ కూడా గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోన్నాయి.

భద్రాచలం వద్ద ప్రస్తుతం 32.2 అడుగుల నీటిమట్టం నమోదైంది. అలాగే కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 12. 26 మీటర్లకు చేరింది. పోలవరం వద్దా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ గోదావరి నది నీటిమట్టం 8.19 మీటర్లుగా రికార్డయింది. వరద ప్రవాహం అధికమౌతున్న కొద్దీ.. ఇది అంతకంతకూ పెరుగుతోంది.

అటు ధవళేశ్వరానికి ఇన్ ఫ్లో భారీగా పెరిగింది. ఇన్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తోన్నారు. అవుట్ ఫ్లో కూడా 3.60 లక్షల క్యూసెక్కులుగా రికార్డయింది.

గోదారమ్మకు వరద తీవ్రత అనూహ్యంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జల వనరుల మంత్రిత్వ శాఖ, ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పరివాహక ప్రాంత ప్రజలకు ముందుజాగ్రత్త సూచనలు చేశారు. ఉండాలని సూచించారు. లంక గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi