Hot Posts

6/recent/ticker-posts

ఇంటిగ్రేటెడ్ సీబీజీ హబ్‌గా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా"


ANDHRAPRADESH:ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాను ఇంటిగ్రేటెడ్ సీబీజీ హ‌బ్ గా అభివృద్ధి చేస్తున్న‌ట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని రిలయన్స్ ప్రతినిధులను కోరారు. తాజాగా స‌చివాల‌యంలో రిల‌య‌న్స్ సంస్థ ప్ర‌తినిధుల‌తో మంత్రి గొట్టిపాటి స‌మీక్ష నిర్వ‌హించారు.

రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రిలయన్స్ ప్రతినిధులను కోరారు. రిల‌య‌న్స్ గ్రీన్ ఎన‌ర్జీలో భాగంగా సీబీజీ ప్లాంట్లు నిర్మాణాలు - ప్రాజెక్టుల‌కు స్థ‌లాల కేటాయింపు త‌దిత‌ర అంశాల‌పై గురువారం స‌చివాల‌యంలో రిల‌య‌న్స్ సంస్థ ప్ర‌తినిధుల‌తో మంత్రి గొట్టిపాటి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాను ఇంటిగ్రేటెడ్ సీబీజీ హ‌బ్ గా అభివృద్ధి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సీబీజీ ప్లాంట్ల‌తో రైతులకు మెరుగైన కౌలు, యువతకు ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయ‌ని మంత్రి తెలిపారు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు, ప్లాంట్ల నిర్మాణాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంద‌న్నారు.

ప్రకాశం జిల్లాలోని వాయుమడుగు, పీసీ పల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లను 26 మార్చి 2026 నాటికి ప్రారంభించాలి. రిలయన్స్ సీబీజీ ప్లాంట్ల నిర్మాణంపై ప్రతీ 15 రోజులకు సమీక్ష నిర్వహిస్తాం. ప్లాంట్ల పురోగతి ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతుంది. ఈ రెండు ప్లాంట్లు మాత్రమే కాకుండా జిల్లాలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్‌గా అభివృద్ధి చేస్తాం. నిరుపయోగంగా ఉన్న భూములకు వినియోగంలోకి తెస్తున్నాం. ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15 వేలు, ప్రైవేట్‌ భూమికి రూ.31వేలు కౌలు చెల్లింపు జరుగుతుంది. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా జిల్లాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తదుపరి దశలో నెల్లూరు జిల్లాలోని కందుకూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కూడా ప్లాంట్లు ఏర్పాటవుతాయి" అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూముల కేటాయింపు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారానికి సంబంధించి అవసరమైన సహాయం ప్రభుత్వం తరపు నుంచి అందుతుందని రిలయన్స్ ప్రతినిధులకు ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. ప్లాంట్ల ఏర్పాటుకు క్షేత్ర స్థాయిలో రిలయన్స్ ప్రతినిధులు కూడా సంబంధిత‌ అధికారులతో కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సీబీజీ ప్లాంట్ల నిర్మాణంతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడమే కాక, గ్రామీణాభివృద్ధికి, యువత ఉపాధికి, పరిశ్రమల ప్రోత్సాహానికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు కూట‌మి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయ‌న‌ వివరించారు. రాష్ట్రంలో శ్రీ సత్యసాయి, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోనూ సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. స‌మీక్షా సమావేశంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, ఏపీ ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి, నెడ్ క్యాప్ ఎండీ ఎం. కమలాకర్ బాబుతో పాటు రిలయన్స్ ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.