HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే డిస్కమ్ పరిధిలోకి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలు.. తదితర కార్యక్రమాలను తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకురానున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్ పీడీసీఎల్, ఎన్ పీడీసీఎల్ ఉండగా.. కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసే డిస్కమ్ కు వ్యవసాయ ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్లు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్ని కొత్త డిస్కమ్ పరిధిలోకి తీసుకు రావాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్ విభాగం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణల అమలుకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలన్నారు. డిస్కమ్ ల పునర్ వ్యవస్థీకరణతోపాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడు ఉన్న రుణ భారం తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
మరోవైపు రాబోయే 5 రోజుల్లోనే రైతుల ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులని పొందుపరిచామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 6 వేలకుపైగా రేషన్ కార్డులను పంపిణీ చేశామన్నారు. సున్నా వడ్డీతో 65 లక్షల మంది మహిళలకు రూ. 25 వేల కోట్ల రుణాలు ఇచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు.