Hot Posts

6/recent/ticker-posts

విశాఖ విజయవాడలలో మెట్రో రైలు కూత


ఇక విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ముందుగా టెండర్లను పిలుస్తారు. ఆ తరువాత విజయవాడలో టెండర్లని ఆహ్వానిస్తారు.

ANDHRAPRADESH:మెట్రో రైలు ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దశాబ్దాల నాటి కల నిజం కాబోతోంది. ఏపీలో ఒక్క మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా లేదు. అయితే 2014 ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం విశాఖపట్నం విజయవాడ లో మెట్రో రైల్ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. అంతే కాదు ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. అతి తక్కువ వడ్డీకి సుదీర్ఘ కాలానికి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం కూడా ఇప్పిస్తుంది.

మొత్తం ప్రాజెక్టులో ఐదో వంతు వాటాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే బ్రహ్మాండమైన మెట్రో రైలు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. ఇదిలా ఉంటే ఏపీలో విశాఖ విజయవాడ కి ఈ భాగ్యం పట్టబోతోంది. ఈ రెండూ పది లక్షల జనాభా కంటే ఎక్కువగా ఉండి ఏపీలో మెట్రో నగరాలుగా ఉన్నాయి. దాంతో ఈ ప్రాజెక్టుకు అర్హత సాధించాయి. 

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెట్రో రైలు ప్రాజెక్టులకు ఫీజిబిలిటీ రిపోర్టులను స్టడీ చేయడం జరిగింది. డీపీఆర్ ని తయారు చేసింది. దాని తరువాత మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి లభించింది. తాజాగా విశాఖ విజయవాడ మెట్రో రైళ్ల నిర్మాణం, పర్యవేక్షణ, సాంకేతిక సహకారం కోసం కన్సల్టెన్సీతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ మధ్య అవగాహన ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు విజ‌య‌వాడ మెట్రో రైలు డిజైన్ తో పాటు సాంకేతిక‌త‌ ఇతర ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం టిప్సాతో, విశాఖ లో మెట్రో పనుల కోసం శిస్ట్రా క‌న్స‌ల్టెన్సీలు ముందుకు వచ్చాయి.

ఇక విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ముందుగా టెండర్లను పిలుస్తారు. ఆ తరువాత విజయవాడలో టెండర్లని ఆహ్వానిస్తారు. విశాఖలో టెండర్లను ఆహ్వానిస్తూ ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 12 వరకూ వెబ్ సైట్ లో ఆసక్తి కలవారు దరఖాస్తులు చేసుకోవచ్చు. 

విశాఖలో మొదటి విడతలో 11 వేల 490 కోట్ల రూపాయల అంచనాతో మూడు క్యారిడార్ల లో మెట్రో రైల్ నిర్మాణం జరుగుతుంది. మొత్తం 42 స్టేషన్లతో ఈ మెట్రో రైలు సాగుతుంది. మూడేళ్ళ కాల వ్యవధిలో ఈ నిర్మాణం పూర్తి అవుతుంది. ఇక విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్రం తన వాటాగా 20 శాతం మొత్తాన్ని రిలీజ్ చేస్తుంది. దానికి మ్యాచింగ్ గా ఏపీ ప్రభుత్వం మరో 20 శాతం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ సంస్థలు మిగిలిన మొత్తాన్ని రుణ సాయంగా అందచేస్తాయి

మెట్రో రైలు ప్రాజెక్టులను విశాఖ విజయవాడ లో వచ్చే ఎన్నికల లోగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులు కనుక పట్టాలెక్కితే అభివృద్ధి అజెండాతో వచ్చే ఎన్నికల్లో కూటమికి ఎదురు ఉండదని భావిస్తోంది. మొత్తానికి చూస్తే సుదీర్ఘ కాలం తరువాత మెట్రో రైలు కూత వినిపిస్తోంది అన్న ఆశలు అయితే జనాలలో ఉన్నాయి. ఇది మంచి పరిణామంగా అంతా స్వాగతిస్తున్నారు.

Author

Shakir Babji Shaik

Editor | Amaravathi