HYDERABAD:తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం మహిత పురం వాటర్ ఫాల్స్ వద్ద వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్లిన వరంగల్ ఎన్ఐటి కి చెందిన విద్యార్థులు అటవీ మార్గంలో దారి తప్పి అక్కడే చిక్కుకుపోయిన సంఘటన చోటుచేసుకుంది. గూగుల్ మ్యాప్ చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ వెళ్లినవారు దట్టమైన అడవిలో చిక్కుకుని పోయారు.
మహితాపురం జలపాతం చూడాలని వెళ్ళిన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు
ఆ తర్వాత కమ్ముకున్న చీకటిలో అడవిలో సిగ్నల్ లేక ఇబ్బంది పడుతూ చివరకు 100కు డయల్ చేసి సహాయం కోసం అర్ధించారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. వరంగల్ ఎన్ఐటి కి చెందిన మూడవ సంవత్సర ఇంజనీరింగ్ విద్యార్థులు ఏడుగురు అటవీ శాఖ పర్యటకుల సందర్శన నిషేధించిన మహితాపురం జలపాతానికి శనివారం సాయంత్రం బొల్లారం మీదుగా జలపాతానికి వెళ్లారు. భారీ వర్షాల కారణంగా చీకటి పడటంతో దారి తప్పిపోయారు.
గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని అడవిలో చిక్కుకున్న విద్యార్థులు
గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్లిన ఎన్ఐటి విద్యార్థులు, చీకటి పడిపోవటంతో దారి తెలీక భయాందోళనకు గురయ్యారు.దీంతో డయల్ 100 కు ఫోన్ చేయడంతో వెంకటాపురం పోలీస్ సిబ్బందితోపాటు,అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా అటవీ మార్గంలో ఏడుగురు విద్యార్థులను కనుగొన్నారు. ఏడుగురులో ముగ్గురు విద్యార్థినులు ఉన్నారు. వారందరినీ రాత్రి 11 గంటల ప్రాంతంలో వెంకటాపురం మండల కేంద్రానికి తీసుకువచ్చి ఆహారం అందించారు.
అడవిలో చిక్కుకున్న వారిని కాపాడిన పోలీసులు, అటవీ అధికారులు
ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటంతో వారందరూ చేరుకొని విద్యార్థులను సురక్షితంగా కాపాడిన, పోలీస్, అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నిషేధిత జలపాతాల వద్దకు వెళ్ళవద్దని,అలా వెళ్లిన పర్యాటకులపై అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అధికారులు బోర్డులు ప్లెక్సీలు ఏర్పాటు చేసినా దొడ్డి దారిన నిషేధిత జలపాతాల వద్దకు వెళ్తున్నారు.
ఈ జలపాతాలకు సందర్శన అనుమతులు లేవు.. వెళ్లొద్దు
ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని మాత్రమే పర్యటకులకు సందర్శనకు అధికారులు అనుమతులు ఇచ్చారు.కాగా వీరభద్రవరం, మహితాపురం, కొంగాల జలపాతాలకు పర్యాటకుల సందర్శన అటవీ శాఖ నిషేధించింది. కనుక నిషేధిత జలపాతాల దగ్గరకు వెళ్ళకుండా ఉంటేనే మంచిది.