నిజానికి చూస్తే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు అని తెలుగుదేశం అఫీషియల్ గా ప్రకటించింది. తన ట్వీటర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ కూడా చేసింది.
ANDHRAPRADESH:ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత ప్రస్తుత స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా చేరుతారా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవును అనే అంటున్నారు. నిజానికి చూస్తే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు అని తెలుగుదేశం అఫీషియల్ గా ప్రకటించింది. తన ట్వీటర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ కూడా చేసింది.
అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్న దాని మీద మాత్రం స్పెక్యులేషన్స్ ఆగడం లేదు. అంతే కాదు ఎవరు కొత్తగా చేరుతారు అన్న దాని మీద ప్రచారం అలాగే సాగిపోతోంది. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు టాపిక్ ఇపుడు ముందుకు వచ్చింది. అయ్యన్నపాత్రుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబుని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. తాను ప్రస్తుతం ఉన్న స్పీకర్ పోస్టులో అంతగా హ్యాపీగా లేను అని ఆయన వివరించినట్లుగా చెబుతున్నారు
అయ్యన్న స్పీకర్ అయ్యారు కానీ వైసీపీ నుంచి జగన్ సహా ఎమ్మెల్యేలు ఎవరూ సభకు హాజరు కావడంలేదు. దాంతో సభ ఏకపక్షంగా సాగిపోతోంది. సాధారణంగా సభలో అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉంటేనే స్పీకర్ కి ఎక్కువ పని ఉంటుంది. అంతే కాదు స్పీకర్ పోస్టులో ఉన్న వారికి కూడా సభ నడిపేందుకు ఒక ఉత్సాహం వస్తుంది.
నిజానికి అయ్యన్న స్పీకర్ గా జగన్ విపక్షంలో అధికారంలో చంద్రబాబు పవన్ వంటి వారు ఉంటే సభ ఒక లెవెల్ లో ఉండేది. జగన్ సభలో మాట్లాడడం అధికార పక్షం నిలువరించడం ఇత్యాది సన్నివేశాలు అన్నీ అసెంబ్లీ సెషన్ మీద ఉత్కంఠ పెంచుతాయని అంటున్నారు. కానీ అలా జరగడంలేదు. ఏకంగా వైసీపీ సభకు దూరంగా ఉంటోంది. దాంతో సభను నడిపిస్తున్న అయ్యన్న సైతం తాను స్పీకర్ పోస్ట్ కంటే మంత్రిగా ఉంటేనే ఎక్కువ న్యాయం చేస్తాను అని భావిస్తున్నారుట.
ఈ క్రమంలోనే తన మనసులో మాటను ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిన వేశారు అని అంటున్నారు. ఇక చూస్తే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో అనేక మంది కొత్త వారు ఉన్నారు. చాలా మంది జగన్ చేసే విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అన్న అసంతృప్తి ప్రభుత్వం పెద్దలకు ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక ఈ మధ్యన రెంటపాళ్ళకు జగన్ వెళ్ళినపుడు ఆయన కారు కింద ఒక కార్యకర్త వృద్ధుడు పడి చనిపోయాడు. అయినా ఈ సంఘటన మీద మంత్రులు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని అంటున్నారు. అదే అయ్యన్నపాత్రుడు లాంటి వారు మంత్రివర్గంలో ఉంటే జగన్ ని పూర్తిగా కార్నర్ చేసేవారు అని అంటున్నారు.
ఇక విపక్షంలో ఉన్నపుడు అయిదేళ్ళ పాటు అయ్యన్న తన బలమైన వాయిస్ ని వినిపించేవారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకి పూర్తిగా టార్గెట్ అయినా సరే వెనక్కి తగ్గలేదు. ఆనాడు ఆయన జగన్ మీద చేసిన ఎన్నో కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చర్చకు తావిచ్చాయి. సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యాయి. ఒక విధంగా టీడీపీకి నైతిక బలం ఇస్తే వైసీపీని పూర్తిగా ఇరుకునపెట్టేలా అయ్యన్న తన వాయిస్ వినిపించేవారు.
అయితే ఇపుడు మాత్రం సీన్ మారింది. అయ్యన్న రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక అయ్యన్న తప్పకుండా మంత్రి అవుతారు అనుకున్న వారికి ఆయన స్పీకర్ కావడం ఒకింత ఆశ్చర్యపరచింది. అయితే ఎక్కువ మంది జూనియర్లకు మంత్రిమండలిలో చోటు ఇవ్వాలని భావించి అలా చేశారు. అయితే పదనాలుగు నెలల కూటమి పాలనలో మంత్రుల పనితీరు మీద ప్రభుత్వ పెద్దలు అసంతృప్తిగా ఉండడంతో సీనియర్లలో ఆశలు చిగురిస్తున్నాయి.
దాంతో అయ్యన్న బాబుతో తన మదిలో మాటను చెప్పారని మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరారని అంటున్నారు. ఇక మంత్రిమండలిలో అయ్యన్న లాంటి సీనియర్ల అవసరాన్ని కూడా బాబు గుర్తించారని అంటున్నారు. ఈ క్రమంలో మంత్రి మండలి విస్తరణ ఎపుడు జరిగినా అయ్యన్నకు చాన్స్ తప్పకుండా ఉంటుందని ప్రచారం అయితే సాగుతోంది. అయ్యన్న మంత్రిగా ఉంటే కనుక వైసీపీకి చుక్కలు చూపించడం ఖాయమని ఆయన అనుచరవర్గం అంటోంది. మరి అయ్యన్న స్పీకర్ చెయిర్ వదిలేసి మంత్రి అవుతారా. అసలు మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా ఉంటే సీనియర్లకు చోటు ఇవ్వడం ఖాయమేనా లాంటి ప్రశ్నలకు జవాబు కోసం అయితే వేచి చూడడమే.

Shakir Babji Shaik
Editor | Amaravathi