Hot Posts

6/recent/ticker-posts

తిరుమలలో కంట్రోల్ పాలసీ- వాటికి చెక్


ANDHRPRADESH:ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 75,183 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,906 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.89 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 18 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమలలో వాహన రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. అంచనాలకు మించిన స్థాయిలో వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తోన్నాయి. ఫలితంగా తిరుమల కాలుష్యమయమౌతోంది. దేవదేవుడి చెంత వాహనాల రణగొణ ధ్వనులు తీవ్రతరమౌతూ వస్తోన్నాయి. పార్కింగ్ కూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కడిపడితే అక్కడ తమ వాహనాలను నిలిపివేస్తోన్నారు భక్తులు.

దీన్ని నియంత్రించడంపై దృష్టి సారించింది టీటీడీ. ఘాట్‌ రోడ్లలో వాహనాలు, తిరుమలలో ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేకంగా ఓ పాల‌సీ డాక్యుమెంట్‌ సిద్ధం చేయాలని భావిస్తోంది. దీనిపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పాలసీని రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం తిరుమల గోకులం స‌మావేశ మందిరంలో ఈ భేటీ ఏర్పాటైంది. టీటీడీ ట్రాన్స్‌పోర్ట్‌, అటవీ, విజిలెన్స్‌, ఆర్టీఏ విభాగాల అధికారుల అధికారులు ఇందులో పాల్గొన్నారు. తిరుమలలో ట్రాఫిక్‌ను నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చర్యల పూర్తిస్థాయిలో చర్చించారు

ఈ సంద‌ర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ పాల‌సీ డాక్యుమెంట్ లో ఈవీ పాలసీ, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను బలోపేతం చేయడం, ప్రైవేట్‌ జీప్‌ డ్రైవర్లకు అవగాహన కల్పించడం, పాత వాహనాల వల్ల ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ట్రాఫిక్‌ నియమాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలు చేర్చాలని సూచించారు.

అలాగే తిరుమలలో ప్రీపెయిడ్‌ టాక్సీ సదుపాయం ఏర్పాటు చేయడానికి ప్రత్యేక పార్కింగ్‌ స్థలాన్ని గుర్తించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం కనీస, గరిష్ట ఛార్జీలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. వాహన రద్దీని, కాలుష్యాన్ని నియంత్రించడానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.