ANDHRPRADESH:హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అటువంటి తులసి మొక్క కొమ్మలలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కొలువు ఉంటాడని, అన్ని హిందూ తీర్థయాత్రల కేంద్రాలు దాని వేళల్లో నివసిస్తాయి అని చెప్తారు. గంగా నది దాని వేళల్లో ప్రవహిస్తుందని, సృష్టిలోని దేవతలందరూ మరియు దాని ఆకులలో, కాండంలో ఉన్నారని అంటారు.
తులసికి శ్రీవారి చెంత ప్రత్యేకమైన స్థాన
అత్యంత పవిత్రమైన హిందూ గ్రంధాలు, వేదాలు పవిత్రమైన తులసి ఆకులపైన భాగంలో కనిపిస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు. తులసి మాత స్త్రీల యొక్క దేవతగా పరిగణించబడుతుంది. అటువంటి తులసి మొక్కకు హిందువుల ఇళ్లలోనే కాదు, తిరుమల శ్రీవారి చెంత కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ఇష్టం. తులసి దళాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు అని భక్తులు చాలా బలంగా విశ్వసిస్తారు.
ఆగస్టు 6వ తేదీన తులసి మహత్యం ఉత్సవం
అటువంటి తులసి మహత్యానికి సంబంధించి ఒక పండుగను, ఒక విశేష వేడుకను టిటిడి నిర్వహించనుంది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఆగస్టు 6వ తేదీన తులసి మహత్యం ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. స్వామివారికి తులసీదళం అత్యంత ప్రీతికరమైనది కాబట్టి శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు టిటిడి పేర్కొంది.
గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో దర్శనం ఇవ్వనున్న గోవిందరాజ స్వామి
తులసి మాతకు స్వామివారి చెంత ఉన్న ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తు చేస్తూ ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు శ్రీ గోవిందరాజ స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడవీధుల్లో దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9:30 నుండి 10 గంటల 30 నిమిషాల వరకు బంగారు వాకిలి చెంత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆస్థానం ఘనంగా జరుగుతుంది.
తులసి మహత్య పురాణ పఠనం
ఈ సందర్భంగా అర్చకులు తులసి మహత్యాన్ని పురాణ పఠనం చేస్తారు. తులసి మాత గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. ఈ విధంగా శ్రావణమాసంలో స్వామివారికి అత్యంత ఇష్టమైన తులసి మాతను ప్రస్తుతించి తులసి మహత్యాన్ని నలు దిశల చాటనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీనికోసం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.